సరికొండ అభివృద్ధికి రూ. 1.15 కోట్లు.. భూమి పూజ చేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి
కడ్తల్, జులై 13(విజయక్రాంతి): కల్వకుర్తి నియోజకవర్గం(Kalwakurthy Constituency) సరికొండ గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దేందుకు రూ. 1.15 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి భూమి పూజ తో పాటు ప్రారంభోత్సవాలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు కేటాయించి, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
అభివృద్ధి పనులు భాగంగా గ్రామంలో రూ. 1.75 కోట్లతో చేపట్టనున్న అండర్ డ్రైనేజీ పనులకు, హెచ్‌ఎండీఏ నిధులు రూ. 30 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు,రూ. 10 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 5 హైమాస్ లైట్లను ఆయన స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ అద్దాల మహేందర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చరికొండ- - నాగిళ్ల, సరికొండ - ముదివెన్ రోడ్ల టెండర్ ప్రక్రియను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, గీత కార్మికుల సంక్షేమం, వృద్ధాప్య, వికలాంగుల పింఛన్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేస్తామని ప్రకటించారు.
కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి:
సరికొండ, బోయిన గుట్ట తండా, పల్లె చిలక తండాల అభివృద్ధికి సహకరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యేకు సర్పంచ్ మహేందర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల ప్రగతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గీత వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రవికాంత్ గౌడ్, మాజీ పీసీసీ మెంబర్ శ్రీనివాస్ గౌడ్, డిసిసి ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రెసిడెంట్ శంకరన్న, ఏఈ పరమేష్, ఇతర కాంగ్రెస్ నాయకులు, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.






