2 September, 2026 | 5:52 PM

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు వెంటనే చెల్లించాలి

02-09-2026 | 04:59pm

విద్యార్థుల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం

ఎబీవీపీ వినతిపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి హామీ

పటాన్ చెరు: విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy) డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి అవసరమైతే అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లను వెంటనే చెల్లించాలని కోరుతూ ఎబీవీపీ(All India Students Council) ఆధ్వర్యంలో విద్యార్థులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌(Fee reimbursement) నిధులు సకాలంలో అందకపోవడంతో పేద, మధ్యతరగతి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన స్కాలర్‌షిప్‌ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకూడదని పేర్కొన్నారు.

పెండింగ్ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల విడుదలకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని, విద్యార్థుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతామని తెలిపారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.