2 September, 2026 | 5:32 PM

లక్కారంలో ఎన్నారై సహకారంతో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

02-09-2026 | 05:06pm

పాఠశాలకు నడుచుకుంటూ వస్తున్న విద్యార్థినుల కష్టాలకు పరిష్కారం

జిల్లా విద్యాధికారి శారద చేతుల మీదుగా సైకిళ్ల అందజేత

ముత్తారం, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): మారుమూల గ్రామాల నుంచి ప్రతిరోజు నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్న ఐదుగురు విద్యార్థినుల ఇబ్బందిని గుర్తించిన ఉపాధ్యాయురాలు చేసిన ప్రయత్నానికి ఎన్నారై దాత సహకారం అందడంతో వారి ప్రయాణ కష్టాలు తీరాయి. జడ్‌పీహెచ్‌ఎస్ లక్కారం పాఠశాలలో చదువుకుంటున్న ఐదుగురు విద్యార్థినులకు సైకిళ్లను జిల్లా విద్యాధికారి  శారద చేతుల మీదుగా అందజేశారు.

మచ్చుపేట, శుక్రవారం పేట గ్రామాల నుంచి ప్రతిరోజు రెండు నుంచి మూడు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ పాఠశాలకు వస్తున్న పందిళ్ల అఖిల, పందిళ్ల తనుశ్రీ, అబ్దుల్ ఆర్షియా, జెట్టి అనూష, సంఘీ సాత్వికలు ప్రయాణంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని హిందీ ఉపాధ్యాయురాలు కొప్పుల శైలజ గుర్తించారు. విద్యార్థినుల ఇబ్బందిని తొలగించాలనే ఉద్దేశంతో ఆమె ఈ విషయాన్ని తమ సమీప బంధువులైన ఎన్నారై డాక్టర్ ప్రగతి వివేకరావు దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన డాక్టర్ ప్రగతి వివేకరావు ఐదుగురు విద్యార్థినులకు ఐదు సైకిళ్ల కొనుగోలుకు ఆర్థిక సహాయం అందించారు. దీంతో బుధవారం జిల్లా విద్యాధికారి శారద చేతుల మీదుగా విద్యార్థినులకు సైకిళ్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డీఈవో శారద మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత పాఠశాల స్థాయి నుంచే తమ జీవితానికి ఒక నిర్దిష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా చదువుకోవాలని సూచించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివితే మంచి భవిష్యత్తును నిర్మించుకోవచ్చన్నారు. విద్యార్థినుల ప్రయాణ ఇబ్బందిని గుర్తించి సైకిళ్లకు ఆర్థిక సహాయం అందించిన ఎన్నారై డాక్టర్ ప్రగతి వివేకరావుకు జిల్లా విద్యాశాఖ తరఫున ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హరిప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు సుహాసిని, ఏఏపీసీ చైర్‌పర్సన్ సౌజన్య, బేగంపేట పాఠశాల గణిత ఉపాధ్యాయుడు రామకిషన్‌రావు, ఉపాధ్యాయులు రాజేశ్వరరావు, మల్లేశం, శైలజ, అరుణ, అశోక్, శ్రీనివాస్, హజీరా, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.