కాంగ్రెస్ 1000 రోజుల పాలన అట్టర్ ఫ్లాప్
మహబూబాబాద్ లో బీఆర్ఎస్ సమరభేరి
మహబూబాబాద్ (విజయక్రాంతి): ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్(Congresse) పాలన వెయ్యి రోజుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యిందని మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలను ఎండగడుతూ బీఆర్ఎస్ శ్రేణులు ప్లకార్డులు చేతపట్టి పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని నలుమూలల నుంచి తరలివచ్చిన గులాబీ సైనికులు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమ నిరసన గళాన్ని వినిపించారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(Banoth Shankar Naik) మాట్లాడుతూ..100 తప్పులు చేసిన శిశుపాలుని తల తెగిపడినట్లే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 420 హామీల్లో ప్రజలను మోసం చేసిన ప్రతి హామీకి ప్రజలే తగిన సమాధానం చెబుతారన్నారు. 1000 రోజుల కాంగ్రెస్ పాలనలో జరిగిన వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకెళ్లి, ప్రభుత్వాన్ని నిలదీస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలకు వాస్తవాలను వివరించాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.






