వినాయకుడు నేర్పే పాఠాలతో సైబర్ భద్రతపై అవగాహన
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సోషల్ మీడియా లో పోస్టర్ చక్కర్లు
వనపర్తి , సెప్టెంబర్ 2 ( విజయక్రాంతి ): వినాయక చవితి సందర్భంగా భక్తి సందేశంతో పాటు సైబర్ భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేలా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ప్రచారాన్ని చేపట్టింది. వినాయకుడు మనకు నేర్పే పాఠాలు సైబర్ విజ్ఞానం కలిగి ఉండండి అనే సందేశంతో రూపొందించిన పోస్టర్ ను వనపర్తి పట్టణ పోలీసులు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అందరిని ఆకట్టుకుంటోంది.
వినాయకుడి రూపంలోని వివిధ అంశాలను సైబర్ భద్రతతో అనుసంధానిస్తూ ప్రజలకు పలు సూచనలు చేసింది. వినే ముందు ఆలోచించాలి, చూసే ప్రతి విషయాన్ని నమ్మకూడదు, అనుమానాస్పద లింకులు, సందేశాలు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలి అని సూచించింది. తెలియని వ్యక్తులు పంపే లింకులు, యాప్‌లు, క్యూఆర్ కోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఓటీపీలు ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేసింది. సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని తెలిపింది.
సైబర్ నేరానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచించింది. సైబర్ మోసాల నుంచి రక్షణకు అప్రమత్తతే ఆయుధమని తెలియని లింక్‌పై క్లిక్ చేసే ముందు ఆలోచించండి.. ఓటీపీ, పాస్‌వర్డ్ ఎవరితోనూ పంచుకోవద్దు.. అనుమానం వస్తే వెంటనే ఫిర్యాదు చేయండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసినట్లు గల పోస్టర్ అందరిని ఆలోచింప జేస్తుంది.






