23 March, 2026 | 3:54 AM

మరోసారి ఎమ్మెల్యేకు ఆశాభంగం

23-03-2026 12:00 AM

గడ్డం వినోద్‌కు దక్కని విప్ పదవి

మరోసారి పరువు పోయే

తిరోగమనం మొదలాయే

బెల్లంపల్లి, మార్చి 22: మరోసారి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు చేదు అను భవం ఎదురైంది. గతంలో మంత్రి పదవి ఆశించి పరాభవానికి గురయ్యారు. ఇది మరిచిపోకముందే ఆయనకు మరోసారి ప్రాధాన్యత కోల్పోయారు. ఇటీవల ప్రభు త్వం పలువురు నేతలకు పదవులను కట్టపెట్టింది. ప్రభుత్వ విప్ వస్తదని ఆయన ఎంతో ఆశించారు. విప్ పై పెట్టుకున్న గంపెడాశ గంగలో కలిసింది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ విప్ కోసం విశ్వప్రయత్నాలు చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన విప్ పదవి జాబితాలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పేరు కల్పించలేదు. దీంతో ఆయన మరోసారి తీవ్ర నిరాశ నిస్పృహకు లోనయ్యారు. తాను మంత్రిగా పని చేసినా చరిత్రను కూడా ప్రభుత్వ, అధిష్టానం గుర్తించలేదని, తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని అసహనాన్ని వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో విప్ చేజారి పోవడంతో మీడియాతో ఎమ్మెల్యే వినోద్ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. చెన్నూరు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినా తనకు ఎంతో రాజకీయ నైపుణ్యత ఉన్నప్పటికీ ప్రాధాన్యత లేపోవడంపై అసంతృప్తి, ఆవేదనను వ్యక్తం చేశారు.

బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచిన తొలుత కోరిన మంత్రి పదవినీ ఆయన సోదరుడు చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వశం చేసుకున్నారు. అది ఎమ్మెల్యే పరాభవానికి నాందివాచకమైంది. విప్ విషయంలో మరోసారి ఆయనకు పూర్వ పరిస్థితే ఎదురైంది. క్రమంగా రాజకీయంగా ఎమ్మెల్యే డ్యామేజి అవుతున్నాడన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. విప్‌ను కోల్పోయిన నేపథ్యంలో బెల్లంపల్లి నియోజక వర్గంలో కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర అసం తృప్తి వ్యక్తం అవుతున్నది. ఎమ్మెల్యే గడ్డం వినోద్ కి రాజకీయ ప్రాధాన్యత తగ్గుతూ వస్తున్నదని పరిశీలకులు భావిస్తున్నారు.

ఎమ్మెల్యేకు పలుకుబడి తగ్గిందా..?

బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు వరుస పరాభవం ఎదురవుతూనే ఉన్నది. ఎమ్మెల్యేగా గెలుపొందాక మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదు. మంత్రి పదవి కోసం డిల్లీ అధిష్టానం చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు. తనూ ఎంతో ఆప్యాయంగా పిలుచు కునే కరిగే అంకుల్ ను మంత్రి పదవీ కోసం ఎన్నో సార్లు కలిసిన చివరకి ఆయనకు ఆశాభంగమే ఎదురైంది. మంత్రి పదవినీ ఆశిం చింది ఎమ్మెల్యే గడ్డం వినోద్ అయితే అదికాస్తా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వశ మైంది. ఈ విషయంలో సోదరుడిదే పై చెయ్యి అయ్యింది. ఘోర పరాభావం చవి చూశారు.

ఇక్కడి నుంచే రాజకీయంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు కౌంట్ డౌన్ మొదలైందనీ విశ్లేషకులు అంటున్నారు. పదవులు దక్కనంత మాత్రాన వెనుకడుగు వేసినట్టు కాదు. కానీ అధిష్టానం దగ్గర ఎమ్మెల్యే కు పలుకుబడి లేదన్న అభిప్రాయాలు లేకపోలేదు. మంత్రి పదవి దక్కలేదు. అదలా ఉం చితే  చివరకి విప్ కూడా చేజారిపోయిం ది. మరోసారి  బంగపడక తప్పలేదు. ఇలా వరుసగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు అవమానాల పర్వం పార్టీ కేడర్లో ఆయన ప్రతిష్ట పలుచన అవుతున్నది.

ఇది ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావమే చూపు తుంది. దేశ రాజకీయాల్లో కీలకంగా నిలిచిన రాజకీయ కురువృద్ధుడు కాకా వెంకటస్వామి పెద్ద కుమారుడు రాజకీయా వారసుల్లో వినోద్ మొదటి శ్రేణి వ్యక్తి. కాగా కాకా వెంకటస్వామి కుటుంబంలో అంతటి ప్రాముఖ్య త పొందిన వినోద్ కు కాంగ్రెస్ లో రాజకీయ సమర్థత క్రమక్రమంగా సన్నగిల్లుతుం దా? అనే అనుమానాలను తాజా  పరిణామాలు బలపరుస్తున్నాయి. క్యాడర్‌లో కూడా ఇవే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కాకా కుమారులుగా వివేక్, వినోద్ లిద్దరూ లైవ్ రాజకీయాల్లో ఉన్నప్పటికీ సమవుజ్జీగా రాజకీయాల్లో ముందుకు వెళ్లడం లేదు. ఎగుడు దిగుడులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పదవుల విషయంలో అనివార్యంగా పోటీ ఏర్పడి విబేధాలు తలెత్తాయి. పదవులు ఇద్దరి మధ్య తగాదాలు, విభేదాలను తెచ్చిపెట్టాయి.

ఇదే క్రమంలో పదవుల పంపకాల్లో అధిష్టానం వివక్ష స్పష్టం కూడా బయట పడిందన్న అభిప్రాయాలు ఎమ్మెల్యే వినోద్ మద్దతుదారుల్లో బలంగా వ్యక్తం అవుతున్నాయి. ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు అధిష్టానం నుంచి సపోర్టు లభించడం లేదనే సంగతి మరోసారి విప్ విషయంలో రుజువైంది. ఈ నేప థ్యంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో..? అనే విషయంపై బెల్లంపల్లి నియోజక కాంగ్రెస్ శ్రేణుల్లో జోరుగా చర్చజరుగుతోంది.