13 June, 2026 | 9:04 PM

నవ కల్పనలకు వేదికగా ఎంఆర్ హబ్ స్టార్టప్ 2026 ను ప్రారంభించిన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి

13-06-2026 07:35 PM

విద్యార్థులు అద్భుతమైన ఆవిష్కరణలతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి

మైసమ్మగూడ మల్లారెడ్డి యూనివర్సిటీలో స్టార్టప్ హబ్ ప్రారంభం యువతకు సరికొత్త అవకాశాలు

ఆలోచనలకు పదును పెట్టండి సరికొత్త స్టార్టప్‌లను సృష్టించండి: ఎమ్మెల్యే మల్లారెడ్డి పిలుపు

​​మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): నిరుద్యోగ యువత కేవలం ఉద్యోగాలను సాధించడమే కాకుండా సరికొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేస్తూ సమాజానికి ఉపయోగపడే పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని మేడ్చల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టి శాసన సభ్యులు మాజి మంత్రి వర్యులు చామకూర మల్లారెడ్డి యువతకు పిలుపునిచ్చారు. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ మైసమ్మగూడలోని మల్లారెడ్డి యూనివర్సిటీ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన "ఎంఆర్ హబ్ స్టార్ట్ అప్ 2026" ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి హబ్‌ను ఘనంగా ప్రారంభించారు.​

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ మల్లారెడ్డి విద్యా సంస్థలు ఎల్లప్పుడూ విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి సృజనాత్మకతను వెలికితీయడానికి ప్రాధాన్యతనిస్తాయని పేర్కొన్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను యువత అందిపుచ్చుకోవాలనినూతన స్టార్టప్‌ల స్థాపనతో దేశ ప్రగతికి భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. విద్యార్థుల సరికొత్త ఐడియాలను ప్రాజెక్టులను వాణిజ్యపరమైన వ్యాపారాలుగా మార్చేందుకు "ఎంఆర్ హబ్"అద్భుతమైన వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్టార్టప్ హబ్ ద్వారా విద్యార్థులకు అవసరమైన మెంటార్‌షిప్ ల్యాబ్ వసతులు,సాంకేతిక సహకారం నిధుల అనుసంధానం వంటి సౌకర్యాలు లభిస్తాయని వర్సిటీ ప్రతినిధులు తెలిపారు.