11 March, 2026 | 3:21 AM

తెలంగాణ సంప్రదాయక సారాగా గుర్తించాలి

11-03-2026 12:09 AM

5 వేల ఏళ్ల నుంచే దేశంలో ఇప్పసారా ఉంది

ఇప్పసారాతో రాష్ట్రానికీ మరియు గిరిజనులకు ఆదాయం

రసాయనాలతో తయారు చేసే సారాకు నేను వ్యతిరేకం

విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

జడ్చర్ల, మార్చి10 : రసాయనాలు ఉపయోగించి తయారు చేసే కల్తీ సారా గురించి తాను మాట్లాడటం లేదని, అడవుల్లో సహజంగా దొరికే ఇప్పపూలతో తయారు చేసే సారాను ప్రమోట్ చేయాలని మాత్రమే కోరుతున్నానని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పపూలతో తయారు చేసే సారాతో తెలంగాణ బ్రాండ్ ను క్రియేట్ చేయాలని, తద్వారా అటు ప్రభుత్వానికీ ఇటు ఆదివాసీ, గిరిజనులకు కూడా భారీ ఎత్తున ఆదాయం వచ్చేలా చూడాలని తాను ప్రభుత్వాన్ని కోరనున్నామని తెలిపారు.

మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో అనిరుధ్ రెడ్డి మాట్లాడారు. ఇప్పపూలతో సారా తయారు చేయడం అనేది 5వేల ఏళ్ల క్రితం నుంచే మన దేశంలో ఉందని, అయితే బ్రిటీష్ వాళ్లు మన దేశానికి వచ్చిన తర్వాత వారు తయారు చేసే మద్యాన్ని అమ్ముకోవడానికి ఇప్పసారా తయారీని బంద్ చేయించారని చెప్పారు.

గతంలో ఇప్పసారా తాగిన వాళ్లు 115 ఏళ్ల వరకూ బతికే వారని, అయితే ఇప్పుడు తాగుతున్న మద్యం కారణంగా 60 ఏళ్లకే మృత్యువాత పడుతున్నారని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారంగా 7 బాటిళ్ల కంటే తక్కువ మద్యం ఉన్నప్పుడు వాటిని పట్టుకొని కేసు చేయడం సాధ్యం కాదని చెప్పారు. ఈ లొసుగు ఆధారంగా బెల్టుషాపుల్లో 6 బాటిళ్ల కంటే తక్కువ మద్యాన్ని పెట్టుకొని అమ్ముకుంటున్నారని వాపోయారు.

ఈ సమస్యలన్నింటికీ పరిష్కారమే ఇప్పసారా అని అభిప్రాయపడ్డారు. ఇప్పసారాను ప్రమోట్ చేయాలన్నది గిరిజనులు, ఆదివాసీలకు ఉపాధి కల్పించాలనే తన సొంత ఆలోచన మాత్రమేనని విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకు బదులుగా ఎమ్మెల్యే స్పష్టీకరించారు. ఇప్పసారాతో లాభాలు ఉన్నాయని, అలాగే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వీటన్నింటిని గురించి  తాను అసెంబ్లీలో మాట్లాడుతానని  స్పష్టం చేశారు. 50 పడగల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడం జరుగుతుందని తెలిపారు. 

ఎందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయని పేర్కొన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు.  సింగిల్ ఫ్యామిలీ పరిహారం రూ.6 నుంచి 18 లక్షలు పెంచమని,జాయింట్ ఫ్యామిలీ పరిహారం రూ.16 నుంచి రూ 18 లక్షలు చేశామన్నారు. తేడాల్లేకుండా అందరికీ సమానమైన పరిహారం ఇస్తామని,2 నెలల్లోనే రూ.374 కోట్ల పరిహారం చెల్లిస్తామని తెలిపారు. ప్లాట్లు కూడా ఉచితంగా  రిజిష్టర్ చేసి ఇప్పిస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ప్రాజెక్టు పనులను  అడ్డుకుంటే ఊరుకోమన్నారు.