18 June, 2026 | 1:41 AM

పంచాయతీ నిధులు స్వాహా

18-06-2026 12:16 AM

ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేసిన గ్రామస్తులు

అధికారుల అలసత్వం పై ఎమ్మెల్యే ఆగ్రహం

మానకొండూరు, జూన్ 17 (విజయక్రాంతి) కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం జగ్గయ్యపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో (2019) (2024) ఆరు సంవత్సరాల పాటు యథేచ్ఛగా జరిగిన అవినీతి, అక్రమాలు, నిధుల స్వహా పై గ్రామస్థులు, ప్రస్తుత పంచాయతీ పాలకవర్గం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు బుధవారం క్యాంపు కార్యాలయంలో కలిసి ఫిర్యాదు చేశారు.

పంచాయతీ నిధుల అవకతవకలపై విచారణ జరిపించాలని కోరారు. గత కొన్ని నెలలుగా గ్రామ ప్రజలు జిల్లా కలెక్టరు , జిల్లా అధికారులను పలుమార్లు కలిసి ఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యమని ఎమ్మెల్యే ఎదుట తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఎటువంటి విచారణ జరుగలేదనీ, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు.  ప్రజలు జరిగిన అక్రమాలపై న్యాయబద్ధంగా విచారణ జరిగేలా విజిలెన్స్ దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఎమ్మెల్యేను కోరారు.

సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి అధికారుల అలసత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  కలెక్టరు ద్వారా విజిలెన్స్ దర్యాప్తుకు ఆదేశించి సమగ్ర విచారణ చేపట్టాలని సిఫారసు లేఖ జారీ చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. ఎమ్మెల్యే  సిఫారసు లేఖ మేరకు జిల్లా పాలన అధికారి బాధ్యులపై చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకొని నిధులను రికవరీ చేసి, అక్రమార్కుల ఆట కట్టించాలని గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.