18 June, 2026 | 2:54 AM

శ్రీ భీమేశ్వర స్వామివారి సేవలో కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల

18-06-2026 12:18 AM

వేములవాడ, జూన్ 17 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామివారిని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఆలయ అర్చకులు వేద మంత్రోచ్ఛారణలతో, స్వస్తి వచనాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు.

అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు ఎమ్మెల్యేకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ డీఈఓ భాస్కర శర్మ స్వామివారి శేషవస్త్రం,లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శ్రీ బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ శ్రావణ్ కుమార్, ప్రోటోకాల్ అండ్ టెంపుల్ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నూగూరి నరేందర్,టెంపుల్ ఇన్స్పెక్టర్ గౌతమ్,ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.