7 August, 2026 | 8:48 PM

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు

07-08-2026 07:30 PM

- సీనియర్ చేనేత కార్మికుడు యాదగిరికి సన్మానం 

కొండపాక,(విజయక్రాంతి): దుద్దెడ చేనేత పారిశ్రామిక సహకార ఉత్పత్తి, విక్రయ సంఘం ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా సంఘం అధ్యక్షుడు వడ్లకొండ శ్రీనివాస్ చేనేత జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. అనంతరం చేనేత రంగ అభ్యున్నతికి, తెలంగాణ ఉద్యమానికి విశేష సేవలందించిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు వడ్లకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ చేనేత కళ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న నేత కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలని అన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు.

అనంతరం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో చేనేత వృత్తినే జీవితాధారంగా ఎంచుకుని దశాబ్దాలుగా అద్భుతమైన చేనేత వస్త్రాలను రూపొందించిన సీనియర్ నేత కార్మికుడు వడ్లకొండ యాదగిరిని సంఘం తరఫున ఘనంగా సన్మానించారు. ఆయనకు ధోతుల జోడాను అందజేసి నేత వస్త్రాలతో ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు నేత కార్మికులు యాదగిరి సేవలను కొనియాడుతూ, యువత చేనేత వృత్తి వైపు ఆసక్తి చూపేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.