రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి
- ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేల కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను ప్రారంభించారు
- అన్నదాతలకు అండగా -కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం
- రైతులు లిఫ్టుల నిర్వహణను రాజకీయాలకు అతీతంగా పర్యవేక్షణ ఉండాలి
- రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి
హుజూర్ నగర్,(విజయక్రాంతి): రైతు సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని రాష్ట్ర శాసనసభ ఎస్టిమేట్ కమిటీ చైర్మన్, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి అన్నారు. గురువారం పట్టణంలోని టౌన్ హాల్ లో హుజూర్ నగర్ సీఐ చరమందరాజు ఆధ్వర్యంలో సర్కిల్ పరిధిలోని లిఫ్టుల నిర్వహణ బాధ్యత, భద్రతపై అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్, జిల్లా ఎస్పీ నరసింహ, ఇరిగేషన్ అధికారులు, రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
గత ప్రభుత్వ హయాంలో లిఫ్టులు నిర్వీర్యం అయ్యాయని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే లిఫ్టుల పునరుద్ధరణ పనులను చేపట్టడంతో పాటు కొత్త లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.రైతులకు నిరంతరం ఉపయోగపడే లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వేల కోట్లతో ఈ ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేశారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ముప్పై ఐదు లిఫ్టులకు రైతులు కమిటీలను వేసుకోవాలని రైతులకు సూచించారు.లిఫ్టుల వద్ద దొంగతనాల నివారణకు రాజకీయాలకు అతీతంగా లిఫ్టుల పర్యవేక్షణ జరగాలన్నారు.అధికారులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకొని రైతుల కోసం నిరంతరం పని చేయాలని తెలిపారు.
ఎక్కువ నీటిని వాడే పంటలు కాకుండా వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలను వేసుకోవాలని రైతులకు సూచించారు. జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ మాట్లాడుతూ... ప్రజా ప్రభుత్వం రైతుల కోసం కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్ ల పర్యవేక్షణకు రైతులతో పాటు అధికారులు అందరూ సహకరించాలని ఇది సామాజిక బాధ్యత అన్నారు.అధికారులకు లిఫ్ట్ ల వారీగా అన్ని లిఫ్టుల పై అవగాహన ఉండాలన్నారు. సీసీ కెమేరాలు ఏర్పాటుతో పాటు విద్యుత్ అధికారులు నిరంతర తనిఖీలు చేపట్టాలని తెలిపారు.
జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ... అన్నదాత సంతోషంగా ఉంటే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. వేల కోట్ల రూపాయలతో నిర్మించిన నిర్వహణ ప్రతి రైతు బాధ్యత అని గుర్తు చేశారు.నిర్వహణ లోపం వల్ల దొంగతనాలు జరుగుతున్నాయని రైతులు, అధికారులు తమ బాధ్యతగా సమిష్టిగా లిఫ్టుల నిర్వహణకు సహకరించాలని కోరారు. ఎల్ నినో లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు లిఫ్ట్ లు రైతులకు చాలా ఉపయోగపడతాయన్నారు. రైతులు అందరూ కలసి లిఫ్టుల బాధ్యత వహించి ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే దొంగతనాల నివారణ సాధ్యం అవుతుందని తెలిపారు. పెద్ద ట్రాన్స్ ఫార్మర్లు, మోటార్లు ఏర్పాటు చేసుకున్న ఈ లిఫ్టుల వద్ద విద్యుత్ అధికారులు కట్టు దిట్టమైన కంచె ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.






