ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సహా సంక్షేమ పథకాలు అమలు
మున్నేరు వరద సమస్యలకు శాశ్వత పరిష్కారంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం
పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపుతో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి
స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి పనుల నాణ్యతను పర్యవేక్షించాలి
3.05 కోట్ల యూఐడీఎఫ్ నిధులతో బీటీ రోడ్డు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, జూన్ 10 (విజయక్రాంతి): ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, చేనేత జౌళి శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని ఎఫ్సీఐ గోదాం నుంచి బైపాస్ రోడ్డు వరకు రూ.3 కోట్ల 5 లక్షల యూఐడీఎఫ్ నిధులతో చేపట్టిన బీటీ రోడ్డు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్, సన్నబియ్యం పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, పేద విద్యార్థుల కోసం యంగ్ ఇండియా పాఠశాలల ఏర్పాటు వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. ఇంట్లో కూడా అన్ని పనులను ఒకేసారి చేయలేమని, అదే విధంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని దశలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
గుడిసెల్లో నివసిస్తున్న పేదలకు కొత్త ఇళ్ల మంజూరుకు తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటానన్నారు. గతంలో మూడు రోజులకోసారి తాగునీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం ప్రతిరోజూ తాగునీరు అందించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మున్నేరు వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించి పనులను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక ప్రజాప్రతినిధులు పర్యవేక్షించాలని, రోడ్లు, డ్రెయిన్ల నాణ్యతపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచకపోతే ప్రజల ఆదాయం ఆసుపత్రులకే వెచ్చించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఖాళీ స్థలాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు మొక్కలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.
హైదరాబాద్ తరహాలో ఖమ్మం నగరం లోనూ వేగంగా అభివృద్ధి జరుగుతోందని, రోడ్ల విస్తరణ, జాతీయ రహదారుల నిర్మాణంతో వ్యాపార అవకాశాలు పెరుగుతున్నాయని మంత్రి తెలిపారు. సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖాదర్ బాబా, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంతరావు, ఆర్డీవో శ్రీనివాస్, సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






