మన ఊరు–మన కోచింగ్ సెంటర్ విజేతకు మంత్రి శ్రీధర్ బాబు సన్మానం
సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించిన మేకల అనూషకు అభినందనలు
మంథని,(విజయక్రాంతి): పేద, గ్రామీణ విద్యార్థులు నాణ్యమైన పోటీ పరీక్షల శిక్షణ కోసం దూర ప్రాంతాలకు వెళ్లి అధిక ఖర్చులు భరించాల్సిన అవసరం లేకుండా చేయాలనే లక్ష్యంతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఏర్పాటు చేసిన "మన ఊరు–మన కోచింగ్ సెంటర్" ఘనతను నమోదు చేసింది. ఈ కోచింగ్ సెంటర్‌లో 2022-23 సంవత్సరంలో శిక్షణ పొందిన ముత్తారం మండలం పారుపల్లి గ్రామానికి చెందిన మేకల అనూష సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించి, మంథని స్థానిక పోలీస్ స్టేషన్ లోనే 2024 లో విధులలో చేరింది. ఈ సంవత్సరం మళ్ళీ మొదలైన మన ఊరు మన కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ సభలో ఆమెను మంథనిలోని లక్ష్మీనరసింహ గార్డెన్స్‌లో మంత్రి శ్రీధర్ బాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు అనూషకు సభాముఖంగా శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు ప్రతిభతో పాటు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ పొందితే ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం అసాధ్యం కాదని పేర్కొన్నారు. యువత లక్ష్యంతో కృషి చేస్తే తప్పకుండా విజయం సాధిస్తారని ఆయన సూచించారు.
సత్కారానికి అనంతరం మేకల అనుష మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఉచితంగా పోటీ పరీక్షల శిక్షణ అందించిన మంత్రి శ్రీధర్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను సాధించిన సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగం వెనుక మంత్రి అందించిన శిక్షణ, ప్రోత్సాహం, మార్గదర్శకత్వమే ప్రధాన కారణమని చెప్పారు. అలాగే తన తల్లిదండ్రుల సహకారం కూడా తన విజయానికి ఎంతో దోహదపడిందన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. తనలాంటి మరెందరో యువత ఉద్యోగాలు సాధించి కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కోచింగ్ సెంటర్ నిర్వాహకులు, విద్యార్థులు పాల్గొని మేకల అనుషను అభినందించారు. మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించిన "మన ఊరు–మన కోచింగ్ సెంటర్" ద్వారా ఇప్పటికే పలువురు యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం ఆనందదాయకమని, గ్రామీణ యువతకు ఈ కేంద్రం ఆశాకిరణంగా మారిందని వారు పేర్కొన్నారు.






