బైండోవర్ నిబంధనలు ఉల్లంఘన.. వ్యక్తికి రూ.1 లక్ష జరిమానా
ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన వ్యక్తిపై చర్యలు
బైండోవర్‌లో ఉన్నవారు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఉట్నూర్,(విజయక్రాంతి): గాదిగూడ మండల కేంద్రానికి చెందిన కురే శివాజీ గతంలో ప్రభుత్వ రాయితీ బియ్యం అక్రమ రవాణా కేసులో నిందితుడిగా ఉండటంతో, అతనిని సత్ప్రవర్తన పాటిస్తానని రూ.1,00,000 బాండ్‌పై బైండోవర్ చేశారు. అయితే బైండోవర్ నిబంధనలను ఉల్లంఘిస్తూ తిరిగి అదే తరహా నేరానికి పాల్పడిన నేపథ్యంలో గాదిగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని గుర్తించిన పోలీసులు సంబంధిత అధికారికి నివేదిక సమర్పించగా, విచారణ అనంతరం గాదిగూడ ఎమ్మార్వో సత్యనారాయణ నిందితుడు కురే శివాజీకి రూ.1,00,000 జరిమానా విధించారు. విధించిన జరిమానాను నిందితుడు 03-08-2026 తేదీన ప్రభుత్వ ఖజానాకు చలాన్ ద్వారా చెల్లించినట్లు నార్నూర్ సీఐ అంజమ్మ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ అంజమ్మ మాట్లాడుతూ, బైండోవర్‌లో ఉన్న వ్యక్తులు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాటిని ఉల్లంఘించి మళ్లీ నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలతో పాటు భారీ జరిమానాలు, జైలు శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రజలు చట్టాలను గౌరవిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించే లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.






