రూ.16.92 కోట్లతో కోదాడలో నూతన ఆర్టీసీ డిపోకు శంకుస్థాపన
కోదాడ జూలై 11(విజయ క్రాంతి): కోదాడ పట్టణంలో రూ.16.92 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన టీఎస్‌ఆర్టీసీ బస్సు డిపో, బస్టాండ్ నిర్మాణ పనులకు శనివారం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్పొరేట్ స్థాయిలో ఆధునిక సౌకర్యాలతో బస్సు స్టేషన్, డిపోను నిర్మిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా రోజుకు 30 లక్షల మంది మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా బస్సు స్టేషన్, డిపో నిర్మాణానికి దాదాపు రూ.17 కోట్ల నిధులు కేటాయించడం సంతోషకరమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైన కోదాడను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.






