11 July, 2026 | 3:33 PM

ఆరుగురు హత్యల ఘటనపై స్పందించిన సీతక్క.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం

11-07-2026 02:31 PM

షాబాద్రంగారెడ్డి జిల్లా(Rangareddy) షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఒక దారుణ ఘటనలో 28 ఏళ్ల సైకో తన భార్య, ఇద్దరు మైనర్ కుమారులతో సహా కుటుంబంలోని ఆరుగురిని దారుణంగా నరికి చంపాడు. నిందితుడు రాజ్ కుమార్ తన భార్య పార్వతీ సరిత (30), వారి ఇద్దరు కుమారులు పరీక్షిత్ (3), దైవిక్షిత్ (2), అలాగే చిట్యాల రుక్కమ్మ (65), చిట్యాల లక్ష్మి (45), 17 ఏళ్ల బాలికను హత్య చేశాడు. బాధితులందరికీ కత్తితో అనేకసార్లు పొడిచిన గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. దర్యాప్తు అధికారుల ప్రకారం, నిందితుడిపై గతంలో 'లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం' (POCSO) కింద కేసు నమోదైన నేపథ్యంలో పగ కారణంగానే ఈ హత్యలు జరిగాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 

జిల్లా వ్యాప్తంగా కలకలం రేపిన ఆరుగురు హత్యల ఘటనపై మంత్రి సీతక్క(Minister Seethakka) స్పందించారు. దైవాలగూడ హత్యల ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క ఫ్యూచర్ సిటీ సీపీ తరుణ్ జోషితో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం సీతక్క రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీతక్క సూచించారు. కేసు దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని సీతక్క అధికారులను ఆదేశించిచారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని సీతక్క ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో కూడా సీతక్క మాట్లాడారు. బాధిత కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలన్న సీతక్క ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని హామీ ఇచ్చారు.