11 July, 2026 | 3:41 PM

పోలవరం ముంపు ముప్పుపై మౌనం వీడాలి

11-07-2026 02:39 PM

- బ్యాక్‌వాటర్ వాస్తవాలను ప్రజల ముందుంచాలి

- వరదలపై అధికార యంత్రాంగం సమన్వయంతో కదలాలి

- అసంపూర్తి కరకట్టను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి

- కల్లూరి, రావులపల్లి డిమాండ్

భద్రాచలం, (విజయక్రాంతి):  పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో(Polavaram Project backwaters) భద్రాచలానికి పొంచి ఉన్న ముంపు ముప్పుపై ప్రభుత్వాలు మౌనం వీడి వాస్తవాలను ప్రజల ముందుంచాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు(CPI State Executive Committee Member) నాయకులు కల్లూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవికుమార్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరి ఉగ్రరూపం దాల్చిన ప్రతిసారీ హడావుడి చేయడం, వరదలు తగ్గగానే సమస్యను గాలికొదిలేయడం అధికార యంత్రాంగానికి పరిపాటిగా మారిందని విమర్శించారు. రాబోయే వరదలను దృష్టిలో పెట్టుకుని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కదిలి ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని వారు స్పష్టం చేశారు.

పోలవరం బ్యాక్‌వాటర్ ప్రభావంతో భద్రాచలం, పరిసర ప్రాంతాలకు ఎంతమేర ముంపు ప్రమాదం ఉందనే అంశంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నదని, శాస్త్రీయ నివేదికలు, బ్యాక్‌వాటర్ లెక్కలను దాచిపెట్టకుండా బహిర్గతం చేయాలని  వారు డిమాండ్ చేశారు. భద్రాచలం మనుగడను ప్రశ్నార్థకం చేసే ప్రమాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై మరొకరు నెపం నెట్టడం మాని శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్చరించారు.

వరదల నుంచి భద్రాచలాన్ని రక్షించాల్సిన కరకట్ట నిర్మాణం అసంపూర్తిగా ఉండటం పాలకుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వొద్దని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న పనుల్లో రాజీకి తావులేకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని, భక్తుల సౌకర్యాలు, ఆలయ ప్రతిష్ఠకు అనుగుణంగా అభివృద్ధి పనులు సాగాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు నరాటి ప్రసాద్, కంచర్ల జమలయ్య, కంభంమెట్టు శ్రీను, మా రెడ్డి శివాజీ  మీసాల భాస్కరరావు  తదితరులు పాల్గొన్నారు.