11 July, 2026 | 3:32 PM

అంగన్వాడీలతో వెట్టి చాకిరి సరికాదు

11-07-2026 02:36 PM

ప్రభుత్వ నిర్వాకంతో మూతబడుతున్న అంగన్వాడీ కేంద్రాలు

నేటి నుంచి సమస్యలపై పాదయాత్ర

స్పందించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం

ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్

భద్రాచలం (విజయక్రాంతి): చాలీచాలని వేతనాలతో బతుకుబండి లాగుతున్న అంగన్వాడీ టీచర్లు, ఆయాలపై పనుల భారం మోపుతూ ప్రభుత్వం వెట్టి చాకిరీ చేయించడం దారుణమని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరాటి ప్రసాద్ అన్నారు. శనివారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా అధ్యక్షురాలు గోనె మనణి తో కలిసి  నరాటి ప్రసాద్ మాట్లాడారు. చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమంలో కీలక భూమిక పోషిస్తున్న అంగన్వాడీలను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అదనపు విధుల పేరుతో వేధింపులకు గురిచేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికార యంత్రాంగం నిర్వాకంతో అంగన్వాడీ వ్యవస్థ క్రమంగా కుప్పకూలుతోందని ఆరోపించారు. కనీస సౌకర్యాలు, అవసరమైన వనరులు సమకూర్చకుండా కేంద్రాలను గాలికొదిలేసి, మరోవైపు అంగన్వాడీలపై పనుల భారం మోపడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అనేక అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పడే ప్రమాదం ఉందని అయన హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్లకు బీఎల్ఓ విధులు అప్పగించడం కేంద్రాల నిర్వహణను పూర్తిగా దెబ్బతీస్తోందన్నారు. ఓటరు జాబితాల సవరణ, ఇంటింటి సర్వేల పేరుతో వారిని వీధుల వెంట తిప్పుతూ అసలు బాధ్యతలకు దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాలు మూతపడితే చిన్నారుల పూర్వ ప్రాథమిక విద్య, పౌష్టికాహారం, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన సేవలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం చెవికెక్కించేలా నేటి నుంచి పాదయాత్ర చేపడుతున్నట్లు ప్రకటించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది పడుతున్న కష్టాలను ప్రజల ముందుంచి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతామన్నారు. అంగన్వాడీల సహనాన్ని చేతగానితనంగా భావిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దునిద్ర వీడి అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లపై స్పందించాలని కోరారు. సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తే అంగన్వాడీల ఆగ్రహం ఉద్యమ ఉప్పెనగా మారుతుందని, రాష్ట్రవ్యాప్తంగా బలమైన పోరాటాలకు సిద్ధమవుతామని నరాటి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కల్లూరు వెంకటేశ్వరరావు రాష్ట్ర సమితి సభ్యులు రావులపల్లి రవి కుమార్, వేల్పుల మల్లికార్జున్, మండల రాజు, రత్నకుమారి చిన్నారి, కంభం మెట్టు శ్రీనివాస్ మా రెడ్డి శివాజీ ఎస్వీఎస్ నాయుడు మీసాల భాస్కరరావు  భద్రాద్రి వెంకటేశ్వరరావు మహేష్,గుంజ రామారావు, సత్తినేడు సాయిరాం, రుద్ర బ్రదర్స్, చింతల రామరాజు తదితరులు పాల్గొన్నారు