ఎల్‌నినో ముప్పు ఉంది.. సాగు తీరు మారాలి!
తక్కువ నీటి పంటలే వేయాలని రైతులకు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
దశలవారీగా అర్హులందరికీ పక్కా ఇళ్లు..
ఇప్పటికే నియోజకవర్గానికి 3,500 మంజూరు చేశామని వెల్లడి
తిరుమలాయపాలెంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి
తిరుమలాయపాలెం , (విజయక్రాంతి): వాతావరణంలో వస్తున్న మార్పులు, ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ సాగు విధానాన్ని మార్చుకోవాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ, తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, పంటల వైవిధ్యీకరణ వైపు దృష్టి సారించాలని కోరారు. బుధవారం తిరుమలాయపాలెం మండలంలో కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించి, పలు సంక్షేమ, అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా పాపాయిగూడెంలో రూ. 2.40 కోట్ల అంచనా వ్యయంతో ఖమ్మం-వరంగల్ ఆర్‌అండ్‌బీ రహదారి నుంచి తెట్టెలపాడు మీదుగా నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, జూపెడ గ్రామంలో రూ. 20 లక్షల వ్యయంతో చేపట్టనున్న నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మేడిదపల్లిలో ఆర్‌టీసీ బస్ షెల్టర్‌ను, గ్రామంలో పూర్తయిన ఇందిరమ్మ ఇళ్లను మంత్రి ప్రారంభించారు.
పేదల చిరకాల స్వప్నం సాకారం
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం సమాజంలోని ప్రతి పేద కుటుంబానికి భరోసా, భద్రత కల్పిస్తోందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ వంటి పథకాలు దిగ్విజయంగా సాగుతున్నాయన్నారు. పేదల చిరకాల స్వప్నమైన సొంతింటి కలను సాకారం చేసేందుకు 'ఇందిరమ్మ ఇళ్ల' పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. తొలి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, రెండో విడతలో మరో 2,000 ఇళ్లు మంజూరు చేశామని.. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి పేదవాడికీ దశలవారీగా ఇల్లు మంజూరు చేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
రైతన్నలకు పూర్తి భరోసా
ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని చెబుతూ.. ఇప్పటికే రూ. 2 లక్షల వరకు రుణమాఫీ అమలు చేశామని మంత్రి తెలిపారు. 'రైతు భరోసా' కింద తొలి విడతగా రూ. 6 వేల చొప్పున రైతుల ఖాతాల్లో 'టింగ్.. టింగ్' మనే మెసేజ్‌ల ద్వారా నిధులు జమ చేసినట్లు గుర్తుచేశారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేసిందని, సన్న ధాన్యం పండించిన రైతులకు క్వింటాకు రూ. 500 చొప్పున ప్రోత్సాహకం అందిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్ ఎస్‌ఈ వెంకట్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యుగంధర్‌రావు, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, ఎంపీడీవో సిలార్ సాహెబ్, తహసీల్దార్ విల్సన్, ఇతర శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.






