30 July, 2026 | 9:37 AM

ఉపాధ్యాయులు సమాజ నిర్మాణ శిల్పులు

30-07-2026 08:58 AM

మంథనిలో రిటైర్డ్ ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్‌కు సన్మానంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మంథని, జూలై 30(విజయక్రాంతి): సమాజ నిర్మాణంలో విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు అన్నారు. మంథని పట్టణంలోని వాసవి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ బిరుదు మధుసూదన్ ఉద్యోగ విరమణోత్సవ కార్యక్రమం ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి శ్రీను బాబు ముఖ్య అతిథిగా హాజరై, మధుసూదన్ ను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి ఆత్మీయ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా  శ్రీను బాబు మాట్లాడుతూ... మధుసూదన్  దశాబ్దాల పాటు నిబద్ధతతో నాణ్యమైన విద్యను అందించి, ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. గురువులు చూపించిన బాటలో విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. విద్యార్థులు తమ ప్రతిభతో తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావడంతో పాటు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఉద్యోగ విరమణ పొందిన మధుసూదన్ శేష జీవితాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఈ సందర్భంగా శ్రీను బాబు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు, మధుసూదన్  కుటుంబ సభ్యులు మరియు పలువురు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.