30 July, 2026 | 9:24 AM

గుడుంబా స్థావరాలపై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడులు

30-07-2026 08:55 AM

16 లీటర్ల నాటు సారాయి స్వాధీనం

200 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం

ఆరుగురిపై కేసులు నమోదు

మోతె, జూలై 30 (విజయ క్రాంతి): సూర్యాపేట జిల్లా మోతే మండల పరిధిలోని గోపతండా, గోల్ తండా, రాంపురంతండా గ్రామాల్లో గుడుంబా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అనిత ఆధ్వర్యంలో సూర్యాపేట ఎక్సైజ్ స్టేషన్, డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి.

దాడుల్లో గుడుంబా తయారీకి వినియోగిస్తున్న 16 లీటర్ల నాటు సారాయిని స్వాధీనం చేసుకున్న అధికారులు, 200 లీటర్ల బెల్లం పానకాన్ని అక్కడికక్కడే ధ్వంసం చేశారు. అక్రమంగా నాటు సారాయి తయారు చేస్తున్న ఆరుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.ఈ దాడుల్లో ట్రైనీ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంతు, ఎస్సైలు సురేందర్ బెనర్జీ, శోభారాణి, రామకృష్ణతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అక్రమ మద్యం తయారీ, విక్రయాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.