18 July, 2026 | 3:04 PM

Breaking News

శాకాంబరీ అలంకరణలో శ్రీ రేణుకా మాత.. భక్తుల వెల్లువ   •   వట్టివాగు ప్రాజెక్టును సందర్శించిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్   •   ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి   •   కరుణించని కారుమబ్బులు.. ఎదగని పంటలు... రైతన్న ఎదలో ఆందోళన   •   బీజేపీతో దేశానికి ప్రమాదం   •   పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికే భవిష్యత్తులో సముచిత గుర్తింపు, పదవులు   •   వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి   •   పచ్చని పొలాల గూటికి చేరిన పొంగులేటి!   •   గోదావరిలో చేపలు పట్టేందుకు వెళ్లి ఐదుగురు మృతి   •  

వర్షాలు తక్కువ.. రైతులు మెట్ట పంటల వైపు దృష్టి సారించాలి: మంత్రి పొంగులేటి

18-07-2026 02:48 PM
  1. శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగు విధానాలు మార్చుకోవాలి
  2. కూసుమంచి మండల పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
  3. రూ.4.61 కోట్లతో ప్రగతి పనులకు శంకుస్థాపన.. చెక్కుల పంపిణీ

కూసుమంచి, జులై 18(విజయక్రాంతి): "ఎలినినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం సాంప్రదాయ సాగు మొండిపట్టు వీడి, మారుతున్న ప్రకృతి సవాళ్లకు అనుగుణంగా అప్రమత్తం కావాలి. అధిక నీటి వినియోగం ఉండే పంటల జోలికి వెళ్లకుండా, తక్కువ నీటి అవసరాలతో చేతికొచ్చే ప్రత్యామ్నాయ మెట్ట పంటల వైపే దృష్టి సారించాలి" అని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. 

శనివారం పాలేరు నియోజకవర్గ పరిధిలోని కూసుమంచి మండలంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, ఇప్పటికే 'రైతు భరోసా' అందించి అన్నదాతలకు అండగా నిలిచామని స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు.

- రూ.4.61 కోట్లతో ప్రగతి బాట..

మండల పర్యటనలో భాగంగా మంత్రి పొంగులేటి పలు చోట్ల శంకుస్థాపనలు చేశారు. మల్లాయిగూడెంలో రూ. 2.52 కోట్లతో పెరికసింగారం ఎన్ఎస్పీ కెనాల్ నుంచి భగవాన్ తండా మీదుగా మల్లాయిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, రూ. 20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం కోక్యా తండాలో రూ. 1.69 కోట్లతో లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పీ కాలువ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు, అగ్రహారంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపనలు చేశారు.

- సంక్షేమ హస్తం.. లబ్ధిదారులకు ఆసరా

కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా సంక్షేమ చెక్కుల పంపిణీ జరిగింది. మండల వ్యాప్తంగా 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా వివిధ అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 111 మంది బాధితులకు రూ. 35.16 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.