ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి: కలెక్టర్
- ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెంచేలా విద్యా ప్రమాణాలు మెరుగుపరచాలి
జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలపై ప్రజలకు నమ్మకం పెరిగేలా విద్యా ప్రమాణాలను మెరుగుపర్చాలని, విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచేందుకు అధికారులు, ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ సూచించారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించడమే విద్యార్థుల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణమన్నారు. ప్రతి విద్యార్థి అభ్యాస పురోగతిపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు తల్లిదండ్రుల్లో ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెంపొందించేలా పనిచేయాలని ఆదేశించారు. ప్రీ-ప్రైమరీ ప్రవేశాలు, విద్యార్థుల నమోదు, మధ్యాహ్న భోజనం, పాఠశాలల పరిశుభ్రత, ఉపాధ్యాయుల హాజరు, కేజీబీవీల నిర్వహణ తదితర అంశాల్లో నిర్లక్ష్యాన్ని సహించబోమని హెచ్చరించారు. విద్యా నాణ్యతను పెంచి ప్రభుత్వ పాఠశాలలను ప్రజల తొలి ఎంపికగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.






