ఇసుక టిప్పర్ బీభత్సం.. బాలుడు మృతి
18-07-2026 02:57 PM
జవహర్‌నగర్, జూలై 18 (విజయక్రాంతి): జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ శివానగర్‌లో శనివారం ఉదయం ఇసుక తరలిస్తున్న టిప్పర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన టిప్పర్ యాక్టివాను ఢీకొనడంతో 13 ఏళ్ల బాలుడు ఎం. సుఫియాన్ ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
మృతుడు సెయింట్ ఆంథోనీ గ్రామర్ స్కూల్‌లో విద్యార్థి. ప్రమాద సమయంలో తన సోదరుడు ఎం. సైఫ్తో కలిసి యాక్టివాపై వెళ్తుండగా టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంతో పరారైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న జవహర్‌నగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






