06-02-2026 12:00:00 AM
గత పాలకులపై అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి నిప్పులు
అశ్వారావుపేట , ఫిబ్రవరి 5 (విజయక్రాంతి): పేదోడి ఇంటికంటే కాలేశ్వరం కమిషన్‌లే ముఖ్యం అన్నట్లుగా గత పాలకులు పాలించారని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేటలో గురువారం భారీ రోడ్ షోలో ఆయన ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధించారు. గత పదేళ్ల పాలనలో పేదవాడి సొంతింటి కలను కేసీఆర్ ప్రభుత్వం తుంగలో తొక్కిందని, కమిషన్ల కోసమే ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చారని ఆయన మండిపడ్డారు.
కమిషన్ల కక్కుర్తితోనే ఇళ్ల నిర్మాణం నిర్లక్ష్యం!
ప్రచార సభల్లో మంత్రి మాట్లాడుతూ... ‘గత పాలకులు పేదవాడి ఆత్మగౌరవమైన ఇల్లు కట్టించడం కంటే, తమ జేబులు నింపుకోవడానికే మొగ్గు చూపారు. పేదవాడికి ఇల్లు కట్టిస్తే కమిషన్లు రావని, లక్షల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చే వేల కోట్ల కమిషన్ల కోసమే ప్రాధాన్యత ఇచ్చారు‘ అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని, అందులో అశ్వారావుపేటకే 4,500 ఇళ్లు కేటాయించినట్లు గుర్తుచేశారు. అశ్వారావుపేట అభివృద్ధిని విస్మరించిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని మంత్రి హెచ్చరించారు.
రూ. 230 కోట్లతో నియోజకవర్గాన్ని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతున్నామని హామీ ఇచ్చారు. సర్వే నంబర్ 911, 1228 వంటి దశాబ్దాల నాటి భూ సమస్యలను పరిష్కరించే బాధ్యత రెవెన్యూ మంత్రిగా తానే స్వయంగా తీసుకుంటానని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రానికే ’తీపి కబురు’ అందించిన అశ్వారావుపేట, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ ప్రభంజనానికి నాంది పలకబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులను, మిత్రపక్షమైన సీపీఐ(ఎం) అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, ప్రతిపక్షాలకు రాజకీయ సమాధి కట్టాలని పిలుపునిచ్చారు.