9 April, 2026 | 4:28 PM

ఆరోగ్యం లేకుంటే— ఎంత సంపాదన ఉన్నా వృథానే

09-04-2026 02:38 PM

హైదరాబాద్: HIV/AIDSపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ ఎయిడ్స్ నియంత్రణ మండలి కేబుల్ బ్రిడ్జిపై నిర్వహించిన మానవహారం కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి సి. దామోదర రాజనరసింహ (Minister Damodar Raja Narasimha)గురువారం పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, HIV/AIDSపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్త కార్యక్రమాలలో భాగంగా ర్యాలీలు, మానవహారాలు, వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. హెచ్‌ఐవీ అనేది మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలహీనపరచే వైరస్ అని తెలిపారు. చికిత్స తీసుకోకుండా ఉంటే అది ఎయిడ్స్‌గా మారుతోందన్నారు.

రక్షణలేని లైంగిక సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి‌ తదితర కారణాలతో   హెచ్‌ఐవీ వ్యాపిస్తోందని వివరించారు. షేక్ హ్యాండ్, ఆలింగనం, కలిసి భోజనం చేయడం వంటి సాధారణ పరిచయాల ద్వారా హెచ్‌ఐవీ వ్యాపించదని చెప్పారు. అవగాహన లేకపోవడం వల్లే భయాలు, అపోహలు, వివక్షలు పెరుగుతున్నాయని, అవగాహనే దీనికి సమాధానం అన్నారు. హెచ్‌ఐవీ బాధితులను సామాజికంగా ఇబ్బంది పెట్టడం‌ సరికాదని సూచించిన మంత్రి వారికి కూడా గౌరవం, సహాయం, సమాన హక్కులు కల్పించాలని తెలిపారు. హెచ్‌ఐవీ,  ఎయిడ్స్ (నివారణ,నియంత్రణ) చట్టం 2017 ప్రకారం, వివక్ష చూపడం చట్టరీత్యా నేరమని చెప్పారు.

ఒక్కప్పుడు హెచ్‌ఐవీ ప్రాణాంతక వ్యాధి.. కానీ, ఇప్పుడు ప్రాణాంతక వ్యాధి కాదు. సమయానికి పరీక్షలు, సరైన చికిత్స తీసుకుంటే నాలుగైదు దశాబ్దాలు కూడా సాధారణ జీవితాన్ని గడపవచ్చన్నారు. ప్రభుత్వం ఉచితంగా టెస్టులు, చికిత్స, మందులు అందిస్తోందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 127 టెస్టింగ్ సెంటర్లు, 33 ఎఆర్టీ సెంటర్ల ద్వారా 1.14 లక్షల మంది పేషెంట్లకు వైద్య సేవలు అందిస్తున్నామని స్పస్టం చేశారు.

ముఖ్యంగా యువతకు ఒక సూచన సెడెంటరీ లైఫ్ స్టైల్_ అనారోగ్యకర అలవాట్లతో జీవితాన్ని పాడు చేసుకోవద్దని హెచ్చరించారు. ఆరోగ్యం లేకుంటే ఎంత మంచి సంపాదన ఉన్నా వృథానే అన్నారు. డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని, అది చాలా ప్రమాదకరమని పేర్కొన్నారు.  ముఖ్యంగా ఇంజక్షన్ల ద్వారా డ్రగ్స్ తీసుకోవడం వల్ల హెచ్‌ఐవీ, ఇతర రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని, ఆరోగ్యవంతమైన కుటుంబాలతో, ఆరోగ్యవంతమైన సమాజం, బలమైన రాష్ట్రం నిర్మితమవుతోందన్నారు. మనందరం కలిసి మరింత వైబ్రంట్ తెలంగాణను తయారు చేసుకుందామని మంత్రి పిలుపునిచ్చారు.