నల్లమలకు అభివృద్ధి జోరు
- రూ.12.70 కోట్ల పనులకు శంకుస్థాపన
- చెంచుల స్వయం ఉపాధికి రూ.1.80 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్
- గురుకులాల్లో మంత్రి ఆకస్మిక తనిఖీలు.. విద్యార్థులతో ముఖాముఖి
- నాణ్యమైన విద్య, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
అచ్చంపేట: నల్లమల గిరిజనులు, ఆదివాసీలు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో నల్లమల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మంగళవారం అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మన్ననూరులో మంత్రి పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
రూ.12.70 కోట్లతో అభివృద్ధి పనులు
అమ్రాబాద్, పదర మండలాల్లో ఆర్టికల్–273(1) గ్రాంట్, ప్రధానమంత్రి ధర్తి ఆబా జనజాతి గ్రామ ఉత్కర్ష అభియాన్ (PM DA–JGUA) పథకాల కింద రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. గురుకులాలు, ఆశ్రమ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, డార్మిటరీలు, కిచెన్ కమ్ డైనింగ్ హాళ్లు, ప్రహరీగోడలు, మరుగుదొడ్ల బ్లాకులు, తాగునీటి సదుపాయాలు, స్టోరేజీ సంపులు తదితర మౌలిక వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. మన్ననూరు పీవీటీజీ గురుకుల జూనియర్ కళాశాల, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల, ఉడిమిల్ల బాలికల ఆశ్రమ పాఠశాలతో పాటు అచ్చంపేట, ఇనోల్, బాణాల, చెంచుగూడెం గిరిజన విద్యాసంస్థల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.
చెంచులకు మార్కెట్ వేదిక
చెంచు గిరిజనుల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చేలా రూ.1.80 కోట్లతో ఆధునిక షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించనున్నట్లు మంత్రి తెలిపారు. నల్లమలలో సేకరించే తేనె, చింతపండు, ఉసిరి, ఔషధ మొక్కలు, వెదురు ఉత్పత్తులు, హస్తకళా వస్తువులు తదితర అటవీ ఉత్పత్తులను నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. మధ్యవర్తుల దోపిడీని అరికట్టి గిరిజన కుటుంబాలకు మెరుగైన ఆదాయం అందించడమే లక్ష్యమన్నారు.
గురుకులాల్లో ఆకస్మిక తనిఖీ
మంత్రి మన్ననూరులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం, పీవీటీజీ గురుకుల విద్యాసంస్థ, గిరిజన బాలికల గురుకుల పాఠశాల తదితర విద్యాసంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, హాస్టళ్లు, వంటశాలలు, భోజనశాలలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు, వసతి గదులను పరిశీలించారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి విద్య, ఆహారం, ఆరోగ్యం, పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, క్రీడా సామగ్రి, బోధనపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా చెప్పాలని, వాటి పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. మహిళా గిరిజన గురుకుల పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, భవనాల మరమ్మతులు, ఉపాధ్యాయుల కొరత వంటి సమస్యలను గుర్తించామని, వాటిని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.
ఉపాధ్యాయుల కొరత భర్తీ
గురుకులాల్లో ఉపాధ్యాయుల కొరతపై మంత్రి స్పందిస్తూ.. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అవసరమైన చోట బోధనా సిబ్బందిని నియమిస్తామని చెప్పారు. సబ్జెక్టుల వారీగా ఖాళీలను గుర్తించి త్వరగా భర్తీ చేయాలని అధికారులను ఆదేశించారు. నాన్‌టీచింగ్ సిబ్బంది, వంట కార్మికుల సమస్యలను కూడా ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందన్నారు.
కార్పొరేట్ విద్యకు దీటుగా..
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు కార్పొరేట్ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులతో సమానంగా పోటీ పడే స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో అందుతున్న నాణ్యమైన కోచింగ్, ఆధునిక బోధనా విధానాలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలను నల్లమల గురుకులాలకు విస్తరిస్తామని తెలిపారు. విద్యార్థులు వైద్యులు, ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, పరిశోధకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడంతో పాటు కాస్మొటిక్ ఛార్జీలను కూడా పెంచినట్లు మంత్రి తెలిపారు. విద్యతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇస్తామని, నల్లమలలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ, సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు.
మహేంద్రనాథ్ ఆశయాల సాధనకు కృషి
దివంగత దళిత ఉద్యమ నాయకుడు పుట్టపాక మహేంద్రనాథ్ కలలు కన్న సమసమాజ నిర్మాణం, దళిత–గిరిజన సాధికారత, నాణ్యమైన విద్య, సమగ్ర అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. నల్లమల బిడ్డల భవిష్యత్తు కోసం అవసరమైన ప్రతి రూపాయినీ ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
అచ్చంపేట అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం
అచ్చంపేట నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. నల్లమలలోని చెంచులు, దళితులు, వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంతో పాటు వారి పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రూ.12.70 కోట్లతో చేపట్టనున్న పనులు నియోజకవర్గ అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని తెలిపారు. అనంతరం మంత్రి మద్దిమడుగు ఆంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దేవసహాయం, డీఈఓ రమేష్‌కుమార్, అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, వివిధ శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు, గురుకులాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, గిరిజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.






