ప్రమాదకరంగా జవహర్ నగర్-యాప్రాల్ ప్రధాన రహదారి
వెంటనే మరమ్మతులు చేపట్టండి వాహనదారుల విన్నపం.
జవహర్ నగర్,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ పరిధిలోని యాప్రాల్ నుండి జవహర్ నగర్(Yapral to Jawahar Nagar) కు వెళ్లే ప్రధాన రహదారి పై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో గుంతలు కనిపించకపోవడంతో ద్విచక్ర వాహన దారులతోపాటు పెద్ద వాహన దారులు తరచూ ప్రమాదానికి లోనవుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సికింద్రాబాద్ కు వెళ్లే ముఖ్యమైన రహదారి కావడంతో నిత్యం ఈ రహదారి వెంబడి రద్దీ ఉంటుందని అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రతిరోజు వేలాదిమంది ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు మరమ్మతులు చేపట్టకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి వెంటనే యుద్ధ ప్రాతిపదికన రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని వాహనదారులు, జవహర్ నగర్ యాప్రాల్ ప్రాంత ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






