నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని మహిళ మృతి
వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
బోధన్,(విజయక్రాంతి): నిజామాబాద్ రైల్వే స్టేషన్‌లో(Nizamabad railway station) అపస్మారక స్థితిలో లభించిన గుర్తుతెలియని మహిళ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం, జూలై 27వ తేదీ రాత్రి సుమారు 11 గంటల సమయంలో 40 నుంచి 45 సంవత్సరాల వయస్సు గల గుర్తుతెలియని మహిళ నిజామాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్–2పై అపస్మారక స్థితిలో పడిఉండగా స్టేషన్ మేనేజర్ గమనించారు. వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి ఆమెను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ మంగళవారం (జూలై 28) ఉదయం 8.30 గంటలకు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. ఆమె కుడి చేతిపై కన్నడ భాషలో "పద్మ" అనే పేరుతో పచ్చబొట్టు ఉండటం గుర్తించినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఎం. హన్మండ్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు ఎవరికైనా తెలిసి ఉంటే నిజామాబాద్ రైల్వే ఎస్‌ఐ సాయి రెడ్డిను 8712658591 నంబర్‌లో సంప్రదించాలని రైల్వే పోలీసులు విజ్ఞప్తి చేశారు.






