29 July, 2026 | 9:57 AM

లక్కీ డ్రా పేరుతో ఫోన్ నంబర్లు ఇవ్వొద్దు..

29-07-2026 08:53 AM

-వినియోగదారులకు డిప్యూటీ తహసీల్దార్ రఘునందన్ హెచ్చరిక

మునుగోడు,జులై 28 (విజయక్రాంతి): లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది ఉచిత బహుమతి ఇస్తాం అంటూ ఫోన్ నంబర్లు అడిగే వ్యక్తులు, సంస్థల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వినియోగదారుల వ్యవహారాలు, పౌర సరఫరాల శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహసీల్దార్ మాచన రఘునందన్(Deputy Tahsildar Raghunandan) సూచించారు.మంగళవారం ఆయన మునుగోడులో మాట్లాడుతూ  పెట్రోల్ బంకులు, సినిమా థియేటర్లు, షాపింగ్ ప్రాంతాలు వంటి రద్దీ ప్రదేశాల్లో కొందరు ఫోన్ నంబర్లు సేకరించి, అనంతరం "లక్కీ డ్రాలో గిఫ్ట్ వచ్చింది" అంటూ సంప్రదించి మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. ముఖ్యంగా నిరుద్యోగులు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని తెలిపారు.

సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సమీపంలోని నవకేతన్ కాంప్లెక్స్‌లో హాలిడే ప్యాకేజీల పేరుతో కార్యకలాపాలు నిర్వహించిన డెక్కన్ రిసార్ట్స్ సంస్థ వేలాది మంది నుంచి ఫోన్ నంబర్లు సేకరించి కోట్ల రూపాయల మేర మోసాలకు పాల్పడిన ఘటనను ఆయన ప్రస్తావించారు. ఈ ఘటనపై కేసు నమోదైనా బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరగలేదన్నారు.ఎక్కడైనా వ్యక్తిగత వివరాలు, ముఖ్యంగా ఫోన్ నంబర్లు, తెలియని వ్యక్తులు లేదా సంస్థలకు ఇవ్వొద్దని, డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని రఘునందన్ సూచించారు. ఉచిత బహుమతులు, భారీ ఆఫర్లు, లక్కీ డ్రాల పేరుతో వచ్చే ప్రలోభాలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉంటేనే ఇలాంటి మోసాలను నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.