1 June, 2026 | 2:22 AM

మిల్లులు బంద్!

01-06-2026 02:01 AM
  1. రెండు నెలలుగా వెంటాడుతున్న సమస్యలు
  2. ఎక్కడ చూసినా కూలీలు, లారీలు, గోదాముల్లో స్థలం కొరత
  3. తక్కువ కూలి ఇస్తుండటంతో పెద్దగా ఆసక్తి చూపని కూలీలు 
  4. ఎక్కువ కూలి గిట్టే ధాన్యం కేంద్రాల వైపు మొగ్గు
  5. ముంచుకొస్తున్న ప్రభుత్వ గడువు
  6. జూన్ 16 నాటికి 2024-25 రబీ బియ్యం అప్పగించాలని హుకుం 
  7. వీలు పడదని తెగేసి చెప్తున్న రైస్ మిల్లర్లు

హైదరాబాద్, మే 31 (విజయక్రాంతి): రైస్ మిల్లులు.. సూటిగా చెప్పా లంటే.. గడిచిన రెండు నెలలుగా రాష్ట్రంలోని రైస్ మిల్లులు దాదాపుగా నిలిచిపో యాయి. ఎక్కడా ధాన్యం మిల్లింగ్ జరగ డం లేదు. ప్రభుత్వం మాత్రం రైస్‌మిల్లు లు నడవకపోవడంపై దృష్టి పెట్టకుండా.. గడువులోగా బియ్యం సరఫరా చేయాల్సిందేనంటూ ప్రభుత్వం ఆదేశాలపై, ఆదేశాలు జారీ చేస్తోంది.

దీనితో 25 శాతం పెనాల్టీ.. అదనంగా మరో 12 శాతం వడ్డీకి బలైపోతామంటూ రైస్‌మిల్లర్లు లబోదిబోమంటున్నారు. ‘అసలు కూలీలు లేకుండా.. ధాన్యాన్ని మిల్లింగ్ చేయలేం. అలాగే లారీలు లేకుండా.. బియ్యాన్ని రవాణా చేయలేం. చివరగా.. గోదాముల్లో స్థలం లేకపోతే.. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లులకు బియ్యాన్ని ఎలా దింపేది’ అని మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు.  

కూలీ గిట్టుబాటు కాక..

నిజానికి రాష్ట్రవ్యాప్తంగా కూలీల కొర త స్పష్టంగా కనపడుతోంది. రాష్ట్రంలోని సుమారు 4,500 లకుపైగా ఉన్న రైస్ మిల్లులకు కూలీలే ప్రధాన యంత్రాలు. కూలీలు లేకుండా.. రైస్ మిల్లులు నడవడం అనేది జరగదుగాక జరగదు. యూపీ, బీహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి కూలీలు వస్తుంటారు. అయితే ఈ సారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల కారణంగా కూలీలు సొంత రాష్ట్రాల నుంచి రావడం ఆలస్యం అయ్యింది.

పైగా పూర్తి స్థాయిలో రాలేదు. వచ్చిన కూలీలు కూడా కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మాత్రమే వెళుతున్నారు. రైస్ మిల్లుల్లో, అలాగే ఎఫ్‌సీఐ, సివిల్ సప్లు గోదాముల్లో కూడా కూలీల కొరత వేధిస్తోంది. కేవలం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కూలీలు కనడుతున్నారు. దీనికి ప్రధా న కారణం.. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒక్కో బస్తా (40 కిలోలు)లో ధాన్యం నింపి, కాంటా పెట్టి, కుట్టి, లారీలోకి ఎక్కిస్తే.. రూ.25 వరకు ఇస్తున్నారు.

అదే రైస్ మిల్లుల్లో మిల్లర్లు అయితే బస్తాకు రూ.10 మాత్రమే ఇస్తున్నారు. ఇక ప్రభుత్వానికి వచ్చేసరికి బస్తాకు కేవలం రూ.6 మాత్రమే ఇస్తున్నారు. దీనితో వచ్చిన కూలీలు ఎక్కువగా కూలీ గిట్టుబాటు అయ్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలకే వెళుతున్నారు. దీనితో రైస్‌మిల్లులను కూలీల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీనితో మిల్లింగును నిలిపివేశారు. గడిచిన రెండు నెలలుగా మిల్లింగు దాదాపుగా నిలిచిపోయింది.

లారీల కొరత..

రైస్ మిల్లులను వేధిస్తోన్న మరో సమస్య.. లారీల కొరత. ఇది కేవలం రైస్ మిల్లులదేకాదు.. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇతర రంగాల్లోనూ ఈ లారీల కొరత అనేది స్పష్టం గా కనపడుతోంది. ఇటు మిల్లింగ్ లేకపోవడం తో.. బియ్యం సరఫరా కూడా దాదాపుగా నిలిచిపోయింది. పైగా ఇప్పటికే లారీల్లో ధాన్యం గానీ, బియ్యం గానీ రవాణా చేస్తే.. వాటిని దింపడానికూడా (అన్‌లోడింగ్) కూలీలు లేకపోవడంతో ఆయా లారీలు గోదాముల వద్ద, రైస్ మిల్లుల వద్ద వారం, పదిహేను రోజులుగా నిలిచిపోతున్నాయి.

లారీల కొరతతోనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కాంటా అయినప్పటికీ.. ధాన్యాన్ని మిల్లులకు తరలించ డానికి తలప్రాణం తోకకు వస్తోంది. రైతులు ఎక్కడికక్కడ ధాన్యం తరలింపుపై ధర్నాలు, నిరసనలు చేపట్టేది కూడా ఇందుకే. లారీల కొరతతో ధాన్యం తరలింపు సాధ్యం కావడం లేదు. ఇదే ప్రభావం రైస్‌మిల్లులపై కూడా ఉం ది. లారీలకొరతతో మిల్లింగు చేసిన బియ్యాన్ని ప్రభుత్వ గోదాములకు తరలించడం కనాకష్టంగా మారింది. ఇటు కూలీలు, అటు లారీల కొరతతో మిల్లింగ్ నిలిపివేయాల్సి వస్తుంది.

గోదాముల్లో స్థలం కొరత..

కూలీలు, లారీలకొరతకు.. తోడుగా గోదాముల్లో స్థలం కొరత కూడా మిల్లర్ల మెడకు చుట్టుకుంటోంది. అరకొరగా లభించే లారీల్లోకి.. అష్టకష్టాలు పడి బియ్యం బస్తాలను ఎక్కించి.. ఎఫ్‌సీఐ, సివిల్ సప్లు గోదాములకు పంపిస్తే.. అక్కడ స్థలం కొరత రైస్ మిల్లర్లను వెక్కిరిస్తోంది. దీనితో 15 నుంచి 20 రోజుల వరకు లారీలను అక్కడే ఉంచాల్సిన పరిస్థితిని రైస్‌మిల్లర్లు ఎదుర్కొంటున్నారు.

దీనితో అదనపు భారాన్ని ఎదుర్కోలేక.. అసలు రైస్ మిల్లింగునే నిలిపివేయడం మినహా వారికి మరో గత్యంతరం లేకపోయిందని వాపోతున్నారు. కూలీలు, లారీలు, గోదాముల్లో స్థలా ల కొరత కారణంగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రైస్ మిల్లులన్నీ మిల్లింగును నిలిపివేసి ప్రభుత్వం వైపు దృష్టి సారించాయి. తమ సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో అని ఎదురుచూస్తున్నాయి.

గడవు సమీపిస్తోంది..

ప్రభుత్వం జూన్ 16 నాటికి 2024-25లో రబీ బియ్యాన్ని పూర్తిగా సరఫరా చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. అసలు కూలీ లు, లారీ లు, గోదాముల్లో స్థలాల కొరతతో.. మిల్లింగునే నిలిపివేసిన సమయంలో.. జూన్ 16 తారీఖు నాటికి బియ్యాన్ని సరఫరా చేయాలంటూ చెప్పడంతో రైస్ మిల్లర్లు గగ్గోలు పెడుతున్నారు. కూలీలు లేకపోతే.. మిల్లింగు జరగదు. లారీలు లేకపోతే రవాణా కాదు.. గోదాముల్లో స్థలం లేకపోతే బియ్యాన్ని అనుకున్న గడువులోగా ఇవ్వలేనిపరిస్థితుల్లో  25 శాతం పెనాల్టీ, 12శాతం అదనంగా వడ్డీ భారా న్ని మోపడానికే ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకుంటుందన్నారు.

గడవునైనా పెంచాలి లేదా కూలీలు, లారీలు, గోదాముల్లో స్థలాల కొరతనైనా తీర్చాలని అంటున్నారు. ౨ నెలలుగా మిల్లింగును నిలిపివేసిన రైస్‌మిల్లర్లు.. కూలీలు, లారీలు, గోదాముల్లో స్థలాల కొరతను ఎదుర్కొని ఎలా గడువులోగా బియ్యాన్ని సరఫరా చేస్తారనేది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నఅంశం. ప్రభుత్వం నుంచి ఏమైనా వెసులుబాటు వస్తే సరేసరి.. లేకపోతే పెనాల్టీ, అదనపు వడ్డీభారం రైస్‌మిల్లర్ల నడ్డీ విరవడం  ఖాయంగా కనపడుతోంది.