లెక్చరర్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల ధర్నా
కుటుంబానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్
గద్వాల, జూలై 29: ఇంటర్మీడియట్ విద్యార్థి తరుణ్ ఆత్మహత్య ఘటనపై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, తరుణ్ కుటుంబ సభ్యులు బుధవారం గద్వాల ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు కుటుంబానికి తగిన నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన తరుణ్ (18) గద్వాలలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. మంగళవారం తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
తరుణ్ ఆత్మహత్యకు కళాశాలలో జరిగిన పరిణామాలే కారణమని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. ఈ ఘటనకు కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌పై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.ధర్నాలో విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ, విద్యార్థులపై మానసిక ఒత్తిడి, వేధింపులు లేకుండా కళాశాలల్లో సురక్షితమైన విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. తరుణ్ మృతిపై నిష్పాక్షిక విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, కుటుంబానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ధర్నా కారణంగా ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్‌యూ, బీఆర్ఎస్‌వీ, యూఎస్‌ఎఫ్‌ఐ తో పాటు ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, తరుణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.






