15 April, 2026 | 9:26 PM

బ్రహ్మోత్సవాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి

15-04-2026 04:09 PM

జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.

మంగపేట,(విజయక్రాంతి): ఏప్రిల్ 27 నుంచి మే 5వ వరకు తొమ్మిది రోజుల పాటు జరిగే మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురష్కరించుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసరాలను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్రస్థాయిలో పరిశీలించి, బ్రహ్మోత్సవాల నిర్వహణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాల జాతర పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మాట్లాడుతూ మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు, సమన్వయంతో పనిచేసి భక్తులకు స్వామి వారి దర్శనం సులభతరం చేయాలి అన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తుల కోసం క్యూ లైన్లలో నిరంతరం మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఆలయ పరిసరాల్లో, స్నానపు ఘాట్ల వద్ద పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఎప్పటికప్పుడు చెత్తను తొలగిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు ముగిసే వరకు ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్ ప్యాకెట్లు, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

భక్తుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపాలని, వాహనాల పార్కింగ్ విషయంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ శాఖ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు అందించే ప్రసాదం నాణ్యతగా ఉండాలని, అన్నదాన కార్యక్రమాల వద్ద తోపులాట జరగకుండా క్రమశిక్షణతో కూడిన ఏర్పాట్లు చేయాలని ఆలయ కమిటీకి సూచించారు. ఉత్సవాల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, జనరేటర్లను సిద్ధం చేసుకోవాలని, ఆలయ వీధుల్లో విద్యుత్ దీపాల అలంకరణ మెరుగ్గా ఉండాలని అధికారులను ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలలో భాగంగా ఫైర్ ఇంజన్లను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎండోమెంట్ ఈవో వీరస్వామి, డిపిఓ వెంకయ్య, ఆర్డబ్ల్యూఎస్ మాణిక్యరావు, పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్, డిఎంహెచ్ఓ గోపాలరావు, డి.ఎస్.పి  కిషోర్ కుమార్ , మంగపేట యస్ఐ టి.వి.ఆర్.సూరి, ఎంపీడీఓ బద్రు నాయక్, అగ్నిమాపక సిబ్బంది, ఆలయ అర్చకులు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.