డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య
డెత్ సెంటర్లగా మారుతున్న డీ-అడిక్షన్ సెంటర్లు
ఎల్బీనగర్: డీ- అడిక్షన్ సెంటర్ లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. మద్యానికి బానిసైన యువకుడిని మార్చుతారని ఆశపడిన కుటుంబానికి కన్నీళ్లు మిగిలాయి. వివరాల్లోకి వెళ్తే.. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్‌లో ఉన్న వేద డీ-అడిక్షన్ రిహాబిలిటేషన్ సెంటర్లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చికిత్స కోసం డీ అడిక్షన్ కేంద్రంలో సరూర్ నగర్ కు చెందిన జిమ్ ట్రైనర్ మణిదీప్(25) అనే యువకుడు మద్యానికి బానిసైన చికిత్స కోసం లేదు డీ- అడిక్షన్ కేంద్రంలో చేరాడు. వచ్చిన రెండు రోజులకే బాత్రూంలోని గ్రిల్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, బంధువులు డీ అడిక్షన్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యంతోనే మణిదీప్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. సమాచారం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా.. అనుమతులు లేకుండా లేదా నిబంధనలకు విరుద్ధంగా కొందరు నిర్వహిస్తున్న డీ-అడిక్షన్, రిహాబిలిటేషన్ కేంద్రాలపై పలు సందర్భాల్లో ఆరోపణలు వస్తున్నా, సంబంధిత శాఖలు కఠిన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలు, సిబ్బంది అర్హతలు, పర్యవేక్షణపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






