మల్లికార్జున్ ఖర్గే సీటు మీద రేవంత్ కన్ను
డీలిమిటేషన్ పై చట్టాలు చేసిందే కాంగ్రెస్
ఖర్గే సీటు మీద రేవంత్ రెడ్డి దృష్టి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
హైదరాబాద్: డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై తెలంగాణ బీజేపీ శాసనసభా పక్ష నేత, ఏలేటి మహేశ్వర్ రెడ్డి(Alleti Maheshwar Reddy) నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో మీడియాను ఉద్దేశించి ప్రసంగించారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టాలు చేసిందని మహేశ్వర్ రెడ్డి తెలిపారు. 1972లో కాంగ్రెస్ డీలిమిటేషన్ వల్ల ఏపీకి ఒక లోక్ సభ సీటు తగ్గిందని సూచించారు.
జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలని రాజ్యాంగంలో పేర్కొన్నారని తెలిపారు. ప్రస్తుత సీట్ల ప్రకారమైతే మహిళలకు 170 సీట్లు మాత్రమే వచ్చే అవకాశముందని చెప్పారు. సీట్లు పెంచి మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే 270కి పైగా సీట్లు వస్తాయని వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడాలేని హైబ్రిడ్ పాలసీని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారని పేర్కొన్నారు. గాంధీ డీలిమిటేషన్(Delimitation) ప్రాసెస్ అనే కొత్త జీడీపీ విధానాన్ని సీఎం సూచించారని వెల్లడించారు.
జనాభా ప్రకారమైతే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం తెచ్చారని వివరించారు. లోక్ సభలో దక్షిణాది రాష్ట్రాలకు 24 శాతం ప్రాతినిధ్యం ఉందని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి మల్లికార్జున ఖర్గే సీటు మీద ఉందని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఖర్గే తర్వాత ఏఐసీసీ అధ్యక్ష పదవి పొందాలని రేవంత్ రెడ్డి చూస్తున్నారని ఆరోపించారు.






