అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం
బెదిరించి రూ.50 లక్షలు గుంజిన జ్ఞానేశ్వర్ అరెస్టు
కేసును మూడు రోజులు పాటు గోప్యంగా దాచిన చందానగర్ పోలీసులు
శేరిలింగంపల్లి, జూలై 2 (విజయక్రాంతి): అండగా ఉంటానని నమ్మించి చందానగర్‌కు చెందిన వితంతువుపై మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడి, బెదిరించి రూ.50 లక్షలకు పైగా వసూలు చేసిన గంగారం కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్‌ను చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని మూడు రోజుల క్రితమే కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినా పోలీసులు వివరాలు గోప్యంగా ఉంచడం విమర్శలకు దారితీసింది.2019లో భర్తను కోల్పోయి మానసిక వేదనలో ఉన్న చందానగర్‌కు చెందిన మహిళకు గంగారం ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నేత కంది జ్ఞానేశ్వర్ (47) పరిచయమయ్యాడు. అండగా ఉంటానని, అన్ని విధాలుగా సాయం చేస్తానని నమ్మించి ఆమెకు దగ్గరయ్యాడు.
ఆ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని 2024లో ఇంటికి పిలిచి శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగిన విషయం ఎవరికైనా చెబితే ప్రాణాలు తీస్తానని, కుటుంబ పరువు తీస్తానని బెదిరించాడు. ఆ భయంతో మౌనంగా ఉన్న బాధితురాలిని పలుమార్లు లైంగికంగా వేధించడంతో పాటు డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఇంటి అవసరాలు, వ్యక్తిగత కారణాలు చెబుతూ విడతలవారీగా మొత్తం రూ.50 లక్షలకు పైగా వసూలు చేశాడు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ విషయం నిర్ధారణ అయింది.చాలా కాలం భయంతో మౌనం వహించిన బాధితురాలు ఇటీవల కుటుంబ సభ్యుల సహకారంతో ధైర్యం చేసి చందానగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి వాంగ్మూలం, బ్యాంకు లావాదేవీలు, ఇతర సాంకేతిక ఆధారాలు సేకరించిన పోలీసులు జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అతడిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.నిందితుడు అధికార కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకుడు కావడంతో అరెస్టు, రిమాండ్ వివరాలను మూడు రోజుల పాటు పోలీసులు బయటకు వెల్లడించలేదు. సాధారణ కేసుల్లో అరెస్టు చేసిన వెంటనే మీడియాకు సమాచారం ఇచ్చే పోలీసులు ఈ కేసులో మాత్రం గోప్యత పాటించడంపై స్థానికులు, ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లతోనే పోలీసులు వివరాలు దాచారని ఆరోపణలు వస్తున్నాయి. మహిళలపై నేరాలకు పాల్పడితే ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని ఈ కేసు రుజువు చేస్తోందని సామాజిక కార్యకర్తలు పేర్కొన్నారు.






