కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్
నాగలిగిద్ద: నాగలిగిద్ద మండల శిక్షణ ఎమ్మార్వో డిప్యూటీ కలెక్టర్ లక్ష్మీ దీపిక బుధవారం కరస్‌గుత్తి గ్రామంలో పర్యటించి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సర్వే ప్రక్రియలో అధికారులు అనుసరిస్తున్న విధానాన్ని నిశితంగా పరిశీలించి, భూ సరిహద్దుల నిర్ధారణ, రికార్డుల పరిశీలన, సాంకేతిక పరికరాల వినియోగం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వే ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం ప్రజావాణిలో అందిన భూ ఫిర్యాదులకు సంబంధించి దరఖాస్తుదారుల భూములను స్వయంగా సందర్శించి పరిశీలించారు.
అసైన్డ్ భూములు, పట్టా భూములకు సంబంధించిన సమస్యలను నిబంధనల మేరకు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని రైతులకు భరోసా కల్పించారు. అనంతరం గ్రామంలో బీఎల్‌వోలు నిర్వహిస్తున్న సర్-2026 ఇంటింటి సర్వే ప్రక్రియను తనిఖీ చేసి, ప్రతి కుటుంబ వివరాలను క్షుణ్ణంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అర్హులందరి వివరాలు నమోదు అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని బాధ్యతాయుతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సంగ్రామ్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శివకృష్ణ, ఆర్‌ఐ అనిల్ రెడ్డి, సర్వేయర్ నరసింహులు, రెవెన్యూ సిబ్బంది, బీఎల్‌వోలు తదితరులు పాల్గొన్నారు.






