చెరగని ముద్ర మెస్సి
కొందరికి ఆట వల్ల గుర్తింపు వస్తుంది. మరికొందరి వల్ల ఆటకు క్రేజ్ పెరుగుతుంది. ఆ రెండో కోవకే చెందుతాడు ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సి. రెండు దశాబ్దాలుగా ఫుట్‌బాల్ ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలడం, ప్రతి మ్యాచ్‌ల్లోనూ నిలకడైన ప్రదర్శన ఇవ్వడం మెస్సిని ఒక లెజెండ్‌గా మార్చాయి.
చిన్నతనంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని హార్మోన్ లోప ఇబ్బందులను దాటుకుని, పట్టుదలతో ఈ స్థాయికి ఎదిగిన అతని ప్రయాణం అందరికీ ఒక గొప్ప స్ఫూర్తి అనడంలో ఎలాంటి సందేహం లేదు. లియోనెల్ మెస్సిని ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత గొప్ప ఆటగాడిగా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతని ఆట శైలి, రికార్డులు సాధించిన విజయాలు మెస్సిని ప్రపంచంలోనే అత్యున్నత స్థానంలో నిలబెట్టాయి. మెస్సి మైదానంలో ఉన్నాడంటే అభిమా నులు వెర్రిక్కిపోతారు.
అతనే మంత్రముగ్ధమైన ఆటే దీనికి కారణం. బంతిని తన ఆధీనంలో ఉంచుకుని ప్రత్యర్థి డిఫెండర్లను దాటుకుంటూ వెళ్లే అతని డ్రిబ్లింగ్ నైపుణ్యం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మెస్సి కేవలం గోల్స్ వేయడమే కాదు, మైదానంలో ఆటను ముందే ఊహించి సహచర ఆటగాళ్లకు అద్భుతమైన పాస్‌లు ఇస్తాడు.
ఫ్రీ- కిక్స్ ద్వారా నేరుగా గోల్స్ చేయడంలో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. 2012 క్యాలెండర్ ఇయర్‌లో మెస్సి ఏకంగా 91 గోల్స్ చేసి, ఒకే సంవత్సరంలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ప్రపంచ అత్యుత్తమ ఫుట్‌బాలర్‌కు ఇచ్చే ఈ ప్రతిష్టాత్మక అవార్డును మెస్సి రికార్డు స్థాయిలో 8 సార్లు గెలుచుకున్నాడు. గొప్ప లక్ష్యాలను చేరుకోవడం ఒక్కోసారి ఆలస్యమవుతుంది. మెస్సి విషయంలోనూ ఇది జరిగింది.
సాకర్‌లో సూపర్‌స్టార్‌గా ఎదిగినా అర్జెంటీనాకు వరల్డ్‌కప్ అందించేం దుకు సుధీర్ఘ కాలం నిరీక్షించాడు. ఎట్టకేలకు 2022లో అర్జెంటీనాకు ప్రపంచ కప్ అందించి, తన కెరీర్‌లో లోటుగా మిగిలిన ఏకైక పెద్ద కలని నెరవేర్చుకున్నాడు. అర్జెంటీనా జట్టును వరుసగా రెండు సార్లు కోపా అమెరికా ఛాంపియన్‌గా నిలిపాడు. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ, మెస్సి ఎప్పుడూ గర్వం ప్రదర్శించడు. వివాదాలకు దూరంగా ఉంటూ, తోటి ఆటగాళ్లను గౌరవిస్తాడు. ఈ గొప్ప వ్యక్తిత్వం అతనికి మరింత గుర్తిం పు ఇచ్చింది. లియో మెస్సి ఫౌండేషన్ ద్వారా చిన్నారులకు విద్య, వైద్యాన్ని అందిస్తూ తన సేవా గుణాన్ని చాటుకున్న మెస్సి ముద్ర ఫుట్‌బాల్ ప్రపంచంలో ఎప్పటికీ చెరిగిపోదు.






