28 May, 2026 | 4:40 AM

సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి

28-05-2026 01:40 AM
  1. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సాగాలి
  2. పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలి
  3. మాజీ మంత్రి హరీష్‌రావు

హైదరాబాద్, మే 27 (విజయక్రాంతి): ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఒకరికొకరు పూర్తి సహకారం అందించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా పార్టీ శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, ఇంఛార్జీలు, సమన్వయకర్తలతో సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో హరీష్‌రావు పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గాల వారీగా నియమితులైన సమన్వయకర్తలు స్థానిక నాయకత్వంతో మమేకమై, ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని, నాయకుడు, కార్యకర్త గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని, సభ్యత్వానికి రూ. 10, క్రియాశీలక సభ్యత్వానికి రూ. 50 రుసుముగా నిర్ణయించినట్లు తెలిపారు. సభ్యత్వ నమోదు రాబోయే ఎన్నికలకు ఉపయోగిపడుతుందని, ఏడు స్థానాలు గెలుచుకున్నామని, వచ్చే ఎన్నికల్లో పదికి పది స్థానాలు గెలుచుకుందామని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతున్నందున..

రైతులు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా జూన్ మొదటి వారంలో సభ్యత్వ నమోదు శిక్షణా కార్యక్రమాలను ప్రారంభిద్దామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్ రెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ చైర్మన్లు ఒంటేరు ప్రతాపరెడ్డి, దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, సమన్వయకర్తలు, మెదక్ జిల్లా మెంబర్‌షిప్ ఇన్చార్జి బాలమల్లు తదితరులు పాల్గొన్నారు.

‘రైతు డిస్కం’ను తిరస్కరించండి

‘రైతు డిస్కం’ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న దరఖాస్తును తిరస్కరించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యుత్ రంగం సంక్షోభంలోకి వెళ్లిందన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ దిశగా నడిపించే కుట్ర నడుస్తోందన్నారు. మూడో డిస్కం ఏర్పాటుపై అన్ని వర్గాల్లో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయని తెలిపారు. ఈ మేరకు బుధవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఈఆర్‌సీ)కు హరీశ్‌రావు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్యుత్తు రంగానికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి, భారీగా నిధులు కేటాయించి, ఈ రంగాన్ని బలోపేతం చేశామని తెలిపారు.

అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనాలోచిత నిర్ణయాలతో విద్యుత్తు రంగాన్ని సంక్షోభంలోకి నెట్టే ప్రయత్నం చేస్తోందని, రైతు డిస్కం పేరిట మూడో డిస్కం ఏర్పాటు చేస్తామని ప్రకటించడం ద్వారా రైతులు సహా అన్ని వర్గాల ప్రజల్లో భయాందోళనలు రేకెత్తిస్తోందని వెల్లడించారు. ఆచరణ సాధ్యం కాని విధానాలతో విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరణ దిశగా నడిపించే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కమిషన్ బహిరంగ విచారణ పూర్తి కాకముందే జూన్ 2 నుంచి రైతు డిస్కం ప్రారంభమవుతుందని ప్రభుత్వం ప్రకటించడం, విచారణ పూర్తికాకముందే తీర్పు చెప్పినట్లుగా కనిపిస్తోందని, అందుకే కమిషన్ ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యంశంగా పరిగణించాలని విజ్ఞప్తి చేశారు.