21 March, 2026 | 12:30 AM

ఆధునిక వ్యవసాయ సాంకేతికతతో మెగా రైతు మేళా

20-03-2026 10:41 PM

హైదరాబాద్, మార్చి  2026: భారతదేశంలోని ప్రముఖ అగ్రి-సొల్యూషన్స్ సంస్థ  కోరోమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖతో భాగస్వామ్యంగా, మెగా రైతు మేళా 2026ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో 5000 మందికి పైగా రైతులు, శాస్త్రవేత్తలు, విధాన నిర్ణేతలు మరియు పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవసాయ ఉత్పాదకతను పెంచే వినూత్న సాంకేతిక  మరియు సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రదర్శించారు.

ఈ కార్యక్రమానికి పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి, మహిళా మరియు శిశు సంక్షేమ శాఖల మంత్రి డి.సీతక్క, వ్యవసాయం, మార్కెటింగ్, సహకారం, హ్యాండ్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ శాఖల  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సమాచార సాంకేతిక, ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్స్ శాఖల  మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ శ్రీ శంకర సుబ్రమణియన్ ఎస్, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి డైరెక్టర్ జనరల్ డా. మంగి లాల్ జాట్, మరియు యూనివర్సిటీ వైస్-చాన్సలర్ మరియు చైర్మన్ ప్రొఫెసర్ ఆల్దాస్ జానయ్య హాజరయ్యారు.

ఈ రైతు మేళా,  రైతులు వ్యవసాయ నిపుణులతో నేరుగా చర్చించేందుకు మరియు పంట పోషణ, పంట సంరక్షణ, విత్తనాలు, ప్రెసిషన్ వ్యవసాయం మరియు వ్యవసాయ యాంత్రీకరణలో తాజా అభివృద్ధులను తెలుసుకునేందుకు వేదికగా నిలిచింది. ఈ కార్యక్రమంలో సాంకేతిక ప్రదర్శనలు, సమతుల్య ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ మరియు వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయంపై నిపుణులతో సమావేశాలు నిర్వహించారు.రైతులకు క్షేత్ర స్థాయిలో నిర్వహించిన ప్రత్యక్ష పంట ప్రదర్శనలో  ఆర్గానిక్ ఇన్‌పుట్స్, కాంప్లెక్స్ ఎరువులు, నానో మరియు ప్రత్యేక పోషకాల వినియోగంతో సమగ్ర పంట పోషణ పద్ధతులను చూపించారు. ఈ ప్రదర్శనలు సమతుల్య పంట పోషణ ద్వారా రైతులు ఉత్తమ వ్యవసాయ పద్ధతులను అనుసరించడానికి మరియు అధిక దిగుబడులు పొందటానికి  సహాయ పడతాయి.