5 July, 2026 | 2:40 AM

సముద్రంపాలవుతున్న మేడిగడ్డ జలాలు

05-07-2026 01:09 AM
  1. ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
  2. టాస్క్ అధ్యక్షుడు ఎర్రోజు శ్రీనివాస్

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎల్‌నినో కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో, తెలంగాణకు లభించిన ప్రాణహిత (గోదావరి) జలాలు ప్రభుత్వ పాలకుల బేషజాలు, ముందుచూపు లేని నిర్ణయాల వల్ల వృథాగా దిగువకు కొట్టుకుపోతున్నాయని తెలంగాణ అధ్యయన సమాలోచన కేంద్రం (టాస్క్) అధ్యక్షుడు డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ విమర్శించారు. శనివారం తెలంగాణ అధ్యయన సమావేశం కేంద్రం టాస్క్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులపై రైతన్న ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర కమిటీ చర్చించారు.

ఈ సమావేశంలో డాక్టర్ ఎర్రోజు శ్రీనివాస్ మాట్లాడుతూ.. లక్ష్మి (మేడిగడ్డ) బ్యారేజి వద్ద గోదావరి నీటి ప్రవాహం 15 వేల క్యూసెక్కులుగా నమోదు చేసుకుంటున్నందున ఆ నీటిని వాడుకునే అవకాశాన్ని వదులుకోవడం ఇప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేసినట్లే అని సభ్యులు అభిప్రాయపడ్డారు. బ్యారేజీకి సంబంధించిన అన్ని 85 గేట్లు పూర్తిగా తెరచి ఉంచడం వల్ల వచ్చిన నీరంతా వృథాగా దిగువకు తరలిపోతోందన్నారు. ఇప్పటికే అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలకు కొద్దిపాటి మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచి ఉంటే, ఈ నీటిని సాగు, తాగు అవసరాలకు ఎత్తిపోసుకునే అద్భుతమైన అవకాశం ఉండేదని చెప్పారు.

పంప్ హౌజ్ ఇన్టెక్ కు దిగువన ఒక రబ్బర్ డ్యాం లేదా మట్టి కట్ట వేసుకుని నీటి మట్టాన్ని 95 మీటర్లకు పెంచి నీటిని మళ్ళించవచ్చని రెండేళ్ళ క్రితమే అప్పటి ఈ-ఇన్-సి ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రభుత్వం ఆ పరిష్కారాన్ని పట్టించుకోలేదని పేర్కొన్నారు. ‘జలాశయాల్లో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని  కేంద్ర జల సంఘం రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది.

ఇంతటి క్లిష్ట సమయంలో కూడా ప్రకృతి ఇచ్చిన వరమైన నీటిని వృథా చేస్తుండటంపై తెలంగాణ రైతాంగం, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ రవీందర్ యాదవ్, వేణుగోపాల స్వామి, జి వెంకటేశ్వర్లు, హెచ్ రవీందర్, ఎం సురేష్, ఎస్ వి సి ప్రకాష్ రూబీ స్టీవెన్సన్, ఆసరిరాజు ఎండి ఫరీద్ డాక్టర్ లక్ష్మణ్, పెద్దూరు వెంకన్న తదితరులు పాల్గొన్నారు.