8 July, 2026 | 11:18 AM

నేరేడుచర్ల పీహెచ్‌సీలో 24 గంటలు వైద్య సేవలు

08-07-2026 10:16 AM

అర్ధరాత్రి సాధారణ ప్రసవం -తల్లి బిడ్డ క్షేమం.

నేరేడుచర్ల, జూలై 08(విజయ క్రాంతి): ప్రజలకు 24 గంటల వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నేరేడుచర్ల(Nereducherla PHC) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. మంగళవారం అర్థరాత్రి సమయంలో అత్యవసరంగా వచ్చిన గర్భిణికి వైద్యులు సకాలంలో చికిత్స అందించి సురక్షిత సాధారణ ప్రసవం నిర్వహించారు.వివరాల్లోకి వెళ్తే,పాలకవీడు మండలం శూన్యం పహాడ్ గ్రామానికి చెందిన సుజాత, భర్త సైదా నాయక్, రెండో కాన్పు పురిటి నొప్పులతో బుధవారం రాత్రి ఒంటి గంట సమయంలో నేరేడుచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు.

విధుల్లో ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీ పరిస్థితిని వెంటనే వైద్యాధికారి డా. పున్న నాగిని కి తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన, అనంతరం రాత్రి 1:55 గంటలకు విజయవంతంగా సాధారణ ప్రసవం నిర్వహించారు. గర్భిణి 3.5 కిలోల బరువున్న ఆరోగ్యవంతమైన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, బిడ్డ ఇద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యాధికారి తెలిపారు. అర్థరాత్రి సమయంలోనూ అందుబాటులోకి వచ్చి విజయవంతంగా ప్రసవం నిర్వహించిన డా. పున్న నాగిని, నర్సింగ్ ఆఫీసర్ ఉదయశ్రీతో పాటు వైద్య సిబ్బంది సేవలను స్థానికులు, కుటుంబ సభ్యులు అభినందించారు.