20 May, 2026 | 6:55 PM

సీఎం, మంత్రుల, పీఏ నంటూ బెదిరింపులు

20-05-2026 05:35 PM

వసూల్ రాజా ఉప్పల సంతోష్ కుమార్ గుప్తా అరెస్ట్

మేడ్చల్ జోన్ ఎసిపి శంకర్ రెడ్డి

​మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి,రాష్ట్ర మంత్రుల  పిఏనని బెదిరిస్తూ  కోట్లాది రూపాయల వసూళ్లకు  పాల్పడుతున్న ఘరానా కేటుగాడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జోన్ ఎసిపి శంకర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ లు తెలిపిన వివరాల ప్రకారం.​.. మెదక్ జిల్లా శివంపేటకు చెందిన ఉప్పల సంతోష్ కుమార్ గుప్తా గత కొంతకాలంగా వసూల్ రాజా' అవతారమెత్తాడు.

తనను తాను కాంగ్రెస్ లీడర్‌గా చెప్పుకుంటూ.కుత్బుల్లాపూర్,కొంపల్లి,సుచిత్ర,మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో భూ వివాదాలు సెటిల్‌మెంట్లు చేయడంలో దిట్టగా మారాడు. ఖరీదైన వాహనాలలో తిరుగుతూ ఖద్దర్ బట్టలు ధరించి విలాసవంతమైన హోటళ్లలో కూర్చొని సెటిల్‌ మెంట్లు చేయడం ఇతనికి ఆనవాయితీగా మారింది. గతంలో పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక వివాదంలో అప్పటి సీఐని ఇరికించి సస్పెండ్ చేయించడంలో కూడా ఇతను కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.

​రూ.25 కోట్ల బెదిరింపులు.RTI అస్త్రం?

​సంతోష్ గుప్తా ప్రధానంగా స్కూళ్లు,బార్లు,రియల్ ఎస్టేట్ వ్యాపారులను టార్గెట్ చేసేవాడు.వ్యాపారాల్లోని లొసుగులను గుర్తించి వాటిపై సమాచార హక్కు చట్టం (RTI) కింద దరఖాస్తులు చేసి బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడేవాడు.గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని మునిరాబాద్‌ లోని ఆర్‌ఆర్ వెంచర్‌ నిర్వాహకులను బెదిరించి ఐదు విల్లాలు ఇవ్వాలని లేదంటే రూ ₹ 25 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేసినట్లు సంతోష్ గుప్తాపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేను సీఎం మనిషిని, మంత్రులు నా మాట వింటారంటూ వ్యాపారస్తులను అతను బురిడీ కొట్టించడం వెన్నతో పెట్టిన విద్యగా మారింది.​

ఇటీవల మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరాబాద్‌ కు చెందిన ఆర్‌ఆర్ రియల్ ఎస్టేట్ వ్యాపారికి సంతోష్ గుప్తా ఫోన్ చేశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి మనిషినని మీ వెంచర్ భూములలో సమస్యలు ఉన్నాయని వచ్చి కలవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సంతోష్ గుప్త బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితుడు సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సంతోష్ గుప్తాపై నిఘా పెట్టారు.పక్కా సమాచారంతో అతడిని అదుపులోకి తీసుకుని బీఎన్ఎస్ (BNS) సెక్షన్ 308 (2) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలించినట్లు ఎసిపి శంకర్ రెడ్డి వెల్లడించారు. మీడియా సమావేశంలో మేడ్చల్ ఎస్ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి, మంత్రుల పేర్లు చెప్పి ఎవరైనా బెదిరింపులకు లేదా వసూళ్లకు పాల్పడితే తక్షణమే పోలీసులను ఆశ్రయించాలని ఇలాంటి కేటుగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దని అధికారులకు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిందితునిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు స్థానిక సిఐ ఎ.సత్యనారాయణ వెల్లడించారు.