నేడు పరకాలలో బహిరంగ సభ
- ములుగు, హనుమకొండ జిల్లాల్లో సీఎం రెవంత్‌రెడ్డి పర్యటన
- మేడారం వనదేవతల దర్శనం
- ములుగులో నూతన కలెక్టరేట్ ప్రారంభం
- రోడ్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, పైలాన్ ఆవిష్కరణ
మహబూబాబాద్, ఆగస్టు 15 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి ఆదివారం ములుగు, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. కామారెడ్డి పర్యటన అనంతరం హెలికాప్టర్ ద్వారా ములుగు జిల్లా మేడారానికి మధ్యాహ్నం 1:30 గంటలకు చేరుకోనున్నారు. సమ్మక్క సారలమ్మ వనదేవతలను దర్శించుకుంటున్నారు.
గట్టమ్మ ఆలయ సమీపంలో రూ.16,007 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పంచాయతీరాజ్ రహదారుల అభివృద్ధి కార్యక్రమానికి గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హెలిప్యాడ్ నుంచి హనుమకొండ జిల్లా పరకాల పర్యటనకు బయలుదేరుతారు.
ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి మేడారం నుంచి ములుగు వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అధికారులు, పోలీస్ శాఖ, వివిధ విభాగాల సిబ్బంది సమన్వయంతో పర్యటనను విజయవంతం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మంత్రి సీతక్క తెలిపారు. హనుమకొండ జిల్లా పరకాలలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కలెక్టర్ ఎస్పీలతో కలిసి పరిశీలించారు.






