16 August, 2026 | 3:32 AM

పళ్ల బురుసుతో మనసుల్ని కడిగేస్తున్న శంభో తాత

16-08-2026 12:00 AM

కిరాణా షాపునకు వెళ్లి కొని తెచ్చుకుంటే సరిపోయే టూత్ బ్రష్ కోసం ఓ తండ్రి కోర్టు మెట్లు ఎందుకు ఎక్కాడు?! తన బిడ్డ పెండ్లికి ఊరందరికీ పత్రికలు పంచిన ఆ కొడుకు.. తన ముసలి తండ్రిని మాత్రం ఎందుకు మరిచిపోయాడు!! వంటి సందేహాల నడుము థియేటర్లలో అడుగుపెట్టింది ‘పళ్లబురుసు’. ఇందులో శంభో పాత్రలో మనిషి బుర్రకు పట్టిన మలినాల్ని కడిగేస్తున్నాడు బలగం సుధాకర్‌రెడ్డి

ఒక సాధారణ వస్తువు (టూత్ బ్రష్) చుట్టూ తిరిగే లోతైన తండ్రీకొడుకుల ఎమోషనల్ డ్రామా ఇది. దర్శకుడు ఉదయ్ చౌహాన్ ఈ సినిమాను తెలంగాణ పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కుటుంబ బంధాల విలువను గుర్తుచేస్తుంది.

బలగం సుధాకర్‌రెడ్డి, మురళీధర్‌గౌడ్, ప్రజ్వల్ యాద్మ, గోమతి ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు పవన్ సీహెచ్ సంగీత దర్శకత్వం వహించారు. ఆగస్టు 14న విడుదలైన ఈ సినిమా కన్నవారిని నిర్లక్ష్యం చేసే వారసుల కళ్లు తెరిపించే కథాంశంతో ఆకట్టుకుంటోంది. 

తెలంగాణలోని ఓ పల్లెటూరిలో ఉండే 68 ఏళ్ల శంభో (సుధాకర్‌రెడ్డి) ఒక ఒంటరి వృద్ధుడు. ఒకసారి పంటి నొప్పితో బాధపడుతున్న అతనికి.. వేపపుల్లలు కాకుండా ‘పళ్లబురుసు’, పేస్ట్ వాడాలని డాక్టర్ సూచిస్తుంది. ఈ విషయాన్ని శంభో తన కొడుకు తిరుపతి (మురళీధర్ గౌడ్)కి చెప్పి టూత్ బ్రష్ తీసుకురమ్మని అడుగుతాడు.

కానీ, కొడుకు నిర్లక్ష్యం చేయడం వల్ల వారి మధ్య చిన్న గొడవ మొదలవుతుంది. ఆ చిన్న వివాదం కాస్తా పోలీస్ కంప్లైంట్, కోర్టు కేసు వరకు వెళ్తుంది. అసలు ఒక పళ్లబురుసు కోసం తండ్రి కోర్టు దాకా ఎందుకు వెళ్లాడు? వారి మధ్య ఉన్న పాత విభేదాలు ఏంటి? చివరకు వారు ఎలా ఒకటయ్యారు? అనేది కథాంశం. 

శంభో పాత్రలో ‘బలగం’ సుధాకర్ రెడ్డి అద్భుతంగా నటించారు. భావోద్వేగ సన్నివేశాల్లో ఆయన నటన కన్నీళ్లు పెట్టిస్తోంది. కొడుకు పాత్రలో మురళీధర్‌గౌడ్ కూడా చక్కటి వైవిధ్యాన్ని చూపించారు. ఈ సినిమాకు అతిపెద్ద బలం క్లైమాక్స్ ఎపిసోడ్. కోర్టు రూమ్ సీన్లలో తండ్రీకొడుకుల మధ్య వచ్చే ఎమోషన్స్, శంభో కేసు వెనుక ఉన్న అసలు కారణం బయటపడే ట్విస్ట్ హృదయాలను కదిలిస్తుంది. తండ్రి పాత్రలో సుధాకర్‌రెడ్డి ఏడిపించేశారు.

ముఖ్యంగా ‘మీ ఫీజు పోనూ మిగతా డబ్బు నా కొడుక్కి ఇవ్వండి’ అంటూ, తాను కొడుకుపై కేసు వేయడానికి అసలు కారణాన్ని లాయర్‌తో చెప్పే మాటలు గుండెల్ని పిండేస్తాయి. కొడుకు క్యారెక్టర్‌లో లీనమైన మురళీధర్‌గౌడ్ డైలాగులతో నవ్వులు పూయించారు. ఓల్డ్ మెన్స్ బ్యాచ్ లైనేసే వృద్ధురాలు పాత్రధారి, సర్పంచ్ పాత్రధారి తెలంగాణ యాస పలకలేకపోయారు. తిరుపతి భార్య మారుతి పాత్రలో నటించిన సుజాత.. అచ్చమైన తెలంగాణ గృహిణిగా మెప్పించింది.

ఫస్ట్ హాఫ్‌లో కథ చాలా నెమ్మదిగా సాగుతుంది. ప్రధాన సమస్యను పక్కనపెట్టి లవ్‌స్టోరీ, పెళ్లి సీన్లపై ఎక్కువగా చూపించడం వల్ల ప్రేక్షకులు కాస్త అసహనానికి గురవుతారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే అసలైన ఘర్షణను మరింత లోతుగా చూపించి ఉంటే సినిమా ఇంకా ప్రభావవంతంగా ఉండేది. కొన్ని కామెడీ సీన్లు సిల్లీగా అనిపిస్తాయి. 

దర్శకుడు ఉదయ్ ఎంచుకున్న పాయింట్ చాలా బాగున్నప్పటికీ, కథనాన్ని నడపడంలో తడబడ్డారు. అయితే క్లైమాక్స్‌ను మాత్రం చక్కగా హ్యాండిల్ చేశారు. పవన్ సీహెచ్ సాంగ్స్ కథకు ఎనర్జీని ఇచ్చాయి. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. తెలంగాణ పల్లె వాతావరణాన్ని, సంభాషణలను సహజంగా చూపించారు.

నిర్మాణ విలువలు అన్నపూర్ణ స్టూడియోస్ స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, తల్లిదండ్రులపై పిల్లల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే ఒక మంచి ప్రయత్నమే ఈ ‘పళ్ల బురుసు’. కథనంలో లోపాలు, సాగతీత ఉన్నప్పటికీ.. క్లైమాక్స్‌లో వచ్చే భావోద్వేగాలు, నటీనటుల సహజ నటన కోసం కుటుంబంతో కలిసి ఒకసారి చూడదగ్గ చిత్రమిది.