16 August, 2026 | 3:31 AM

రాష్ట్రహక్కులకు భంగం కలిగితే సహించం

16-08-2026 12:08 AM
  1. పరిపాలనలో కేంద్రానికి సహకరిస్తాం
  2. పంద్రాగస్టు వేడుకల్లో తమిళనాడు సీఎం విజయ్

చెన్నై, ఆగస్టు 15: రాష్ట్ర హక్కులకు భంగం కలిగితే ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని, కానీ పరిపాలనాపరమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామని తమిలనాడు సీఎం విజయ్ అన్నారు. అవినీతిని నిర్మూలించడం స్వేచ్ఛతో సమానమని, తమ ప్రభుత్వం ఆ లక్ష్యం దిశగా పనిచేస్తోందని తెలిపారు. చెన్నైలోని జార్జ్ ఫోర్ట్‌లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ జెండాను ఎగురవేసి, తొలి ప్రసంగం చేశారు.

సీఎం విజయ్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఇవే. దీంతో ఈ ఉత్సవాలు ఇటు రాజకీయ వర్గాల్లో, అటు సినీ అభిమానుల్లో అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఫోర్ట్ సెయింట్ జార్జికి వచ్చిన విజయ్‌కి ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు. అనం తరం పరేడ్‌లో పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో నటి త్రిష సీఎం విజయ్‌కి సెల్యూట్ చేసి, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ వేడుకల్లో సీఎం విజయ్ మాట్లాడుతూ పరిపాల నాపరమైన అంశాలలో కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. ఒకవేళ రాష్ట్ర హక్కులకు భంగం కలిగితే తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. అవినీతిని నిర్మూలించడం స్వేచ్ఛతో సమానమని, తన ప్రభుత్వం ఆ లక్ష్యందిశగా పనిచేస్తోందని విజయ్ అన్నారు. ప్రభుత్వ ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నామని, అన్ని శాఖలలో అవినీతిని రూపుమాపేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.

తన నాయకత్వంలో పారదర్శక మైన, ఉత్తమ పాలనను అందిస్తామని ఉద్ఘాటించారు. ఎవరిపేరునూ ప్రత్యేకంగా ప్రస్తా వించకుండానే, తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే శక్తులను ఓడిస్తామని, తన పాలనకు వ్యతిరేకంగా జరిగే కుట్రలను భగ్నం చేస్తామని స్పష్టం చేశారు. అందరూ సమానంగా జన్మించారనే గొప్ప సూత్రం ఆధారంగా తమ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఇది పారదర్శకమైనది, నిజాయితీతో కూడినది, అవినీతి, లంచగొండితనం, మాదకద్రవ్యాల సంస్కృతికి తావులేనిదని చెప్పారు. అలాగే, మహిళల భద్రత, సామాజికన్యాయం పునాదులని పేర్కొన్నారు.

పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా త్రిష

విజయ్ సీఎం అయ్యాక జరుగుతున్న తొలి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు నటి త్రిష తన తల్లితో కలిసి హాజరయ్యా రై, ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సీఎం విజయ్ తల్లిదండ్రుల పక్కనే కూర్చొన్న ఆమె.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. ప్రత్యేకఆహ్వానితుల కోసం ముందు వరుసలో ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె ఆసీనులయ్యారు.

ఈ వేడుకలకు వచ్చిన వారి దృష్టిని త్రిష ఆకర్షించింది. వేడుకల్లో ఉత్సాహంగా కనిపించిన త్రిష, వచ్చిన అతిథులకు హాయ్ చెబుతూ సందడి చేశారు. సీఎం విజయ్ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం పరేడ్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ క్రమంలో త్రిష విజయ్‌కి సెల్యూట్ చేశారు. ప్రభుత్వ వేడుకల్లో త్రిషకు ఇచ్చిన ప్రాధాన్యం, తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.