18-02-2026 01:14:42 AM
మెదక్, ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): భూమి వివాదం కేసులో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోలేదని ఆరోపిస్తూ మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. మెదక్ జిల్లా చేగుంట మండలం బోనాల గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళ భూమి వివాదం విషయంలో కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం భూ హక్కులకు సంబంధించి ఇరు పక్షాలకు నోటీసులు జారీచేసి పరిష్కరించాలని ఆదేశించింది.
అయితే కోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని బాధితురాలు లక్ష్మి కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేసింది. దీంతో కలెక్టర్ ఉద్దేశ్యపూర్వకంగా కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని, కలెక్టర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 2 వేల జరిమానా విధిస్తూ మంగళవారం హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాగా తీర్పు అమలును నాలుగు వారాల పాటు నిలిపివేసి అప్పీలు చేసుకునేందుకు కలెక్టర్‌కు గడువు ఇచ్చినట్టు హైకోర్టు తెలిపింది.