వ్యాయామ విద్య బలోపేతానికి చర్యలు
ఆదిలాబాద్, మార్చి ౧ (విజయక్రాంతి): వ్యాయామ విద్య బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని తెలంగాణ పిడి, పీఈటీల అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని యాదవ భవనంలో నిర్వహించిన తెలంగాణ పిడి, పీఈటీల జిల్లా సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం డైరీ, క్యాలెండర్లను సంఘం రాష్ట్ర అధ్యక్షులు ధూమర్ల నిరంజన్, వివిధ ఉపాధ్యాయ సంఘాల రాష్ట్ర, జిల్లా బాధ్యులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. పాఠశాలల్లో వ్యాయామ ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని త్వరలోనే పాఠశాలలో వ్యాయామ విద్య బోధించేందుకు ప్రభుత్వం ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో సిలబస్ ప్రవేశపెట్టబోతుందని తెలిపారు.
జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక
సమావేశంలో తెలంగాణ పిడి, పీఈటీల అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నూతన అధ్యక్షులుగా సిహెచ్ కాంతారావు, ప్రధాన కార్యదర్శిగా ఎన్. స్వామి, కోశాధికారిగా సత్యనారాయణ గౌడ్, ఉపాధ్యక్షులుగా గోపాల్, అశోక్, జాయింట్ సెక్రటరీలుగా మోహన్ సింగ్, వినోద్, గౌరవ సలహాదారుగా దయానంద్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ సమావేశంలో పి.ఆర్.టి.యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకర్ రావు, గౌరవ అధ్యక్షులు చంద్రశేఖర రావు, పిడి, ఈటిల సంఘం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు మొగులాల్, ఎన్నికల అధికారి శంకర్ నాయక్, పిఆర్టియు జిల్లా శాఖ నూర్ సింగ్, ప్రధాన కార్యదర్శి నవీన్ యాదవ్, కోశాధికారి ముజీబ్, సంఘం జిల్లా రాష్ట్ర బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.




