ఆదివాసీ గూడల్లో హోలీ సంబురాలు
- ఉత్సాహంగా కామ దహనం (దురాడి)... హోలీ (దుర్ది) వేడుకల్లో ఆదివాసీలు...
వింత ఆచార వ్యవహారాలతో ఆదివాసీల పండగలు
ఆదిలాబాద్, మార్చి ౧ (విజయక్రాంతి): హోలీ అంటే రంగుల పండగ అని మనందరికీ తెలుసు. ఈ పండగ వసం త కాలంలో ప్రకృతిలో పువ్వులు పూసే సమయంలో జరుపుకునే భారతీయ సాంప్రదాయ పండుగ. అయితే ఈ హో లీ పండుగను ఆదివాసీగోండు పల్లెల్లో చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. హోలీ పండుగ నిర్వహించే రోజు ఉదయాన్నే గ్రామంలోని పటేల్ ఇంట్లో అందరు కలిసి గ్రామం నుండి ఒకరిద్దరు గోదావరి నదికి వెళ్లి పవిత్ర జలాలను గ్రామానికి తీసుకురా వడానికి వెళ్తా రు.
మిగితా వారు అందరు పటేల్ ఇంటి నుండి ఒక టెంకా య, చక్కెర, ఊధ్ బత్తీలు, పప్పు బెల్లం, పసుపు, కుంకుమ, గొడ్డలి, కత్తి పట్టుకొని గ్రామ సమీపంలో ఉన్న అడవిలో ఉన్న వెదురు చెట్టు దగ్గర వెళ్లి, దానికి పూజ చేసి, ఊద్ బత్తీలు వెలిగించి, పసుపు కుంకుమతో పూజలు చేసి, పప్పు బెల్లం నైవేద్యం పెట్టి, మొక్కి మూడు వెదురు బొంగులను గ్రామానికి తీసుకువస్తారు.
అప్పటికే గ్రామంలోని పటేల్ ఇంటి ముందర వాకీట్లో పటేల్, దేవారి, మహాజన్, గట్య, హవల్దార్ ఒక పవిత్ర గొంగళి ముందర పరుచుకుని కూ ర్చుంటారు. ఈ సమయంలో గ్రామంలోని ప్రతి ఇంటి నుం డి ఇంటి పెద్ద తీసుకువచ్చిన కుడుకలు, చక్కెర పేర్లు గ్రామస్తుల సమక్షంలో పటేల్, దేవారికి సమర్పిస్తారు. గ్రామంలో కొత్తగా వచ్చిన కుటుంబం వారు కూడా ఈ కుడుకలు, చక్కె ర పేర్లు సమర్పిస్తారు.
ఇచ్చిన కుడుకలు చక్కెర పేర్లను లెక్క పెడుతారు. దాంతో గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో తెలుస్తుంది. ఆ తరువాత అడవి నుండి తీసుకువచ్చిన మూ డు వెదురు బొంగులలో ఒకదాన్ని నరికి రెండు బద్దలు వేరుచేసి వాటితో బాసింగలు తయారు చేస్తారు. ఆ తరువాత గ్రామస్తులు ఇచ్చిన కుడుకలు, చక్కెర పేర్లను కొన్నిటిని, పటేల్ ఇంట్లో వండిన గారేలు, బూరేలు, లేత ఉల్లిగడ్డలు, ఆ బాసింగాలకు కడుతారు.
బాసింగాలు సిద్ధం అయ్యాకా వాటిని ఒక పవిత్ర గొంగళిలో భద్రంగా చుట్టి పెడుతారు. అదే సమయంలో గ్రామంలోని కొందరు యువకులు డోలు, డప్పులు వాయిస్తూ గ్రామ వీధుల్లోని ప్రతి ఇంటి ఇం టికి తిరుగుతూ కట్టెలు, ఆవు పిడుకలు సేకరిస్తారు. వెదురు తో తయారు చేసిన బాసింగాలను పట్టుకొని ఇంటి నుండి డోలు వాయిస్తూ గ్రామ పొలిమేర వైపు బయలుదేరుతారు.
పటేల్ వెనుక గ్రామస్థులు చిన్న పెద్ద అందరు కలిసి ఉత్సాహంగా బయలుదేరుతారు. అక్కడ రెండు గోతులు తవ్వుతా రు. రెండు వెదురు కర్రలలో ఒకటి మాతరి అంటే (ముసలి మహిళ), ఇంకోటి మాత్ర అంటే (ముసలి వాడు) అని భావిస్తారు. ఆ తరువాత మాతరి, మాత్రలను గోతుల్లో రెండు వేరు వేరు వెదురు బొంగుకు పటేల్ ఇంట్లో తయారు చేసిన బాసింగాలను వెదురు కర్రలకు పైన తాళ్లతో కట్టి క్రిందకు వేలాడిదీస్తారు. వాటి చుట్టూ గ్రామ యువకులు సేకరించిన కట్టెలు, ఆవు పిడుకలు పేర్చుతారు.
ఆ తరువాత ముందుగా మాత్ర (ముసలి వాడు) కు నిప్పు పెడతారు. ఆ తరువాత మాతరి (ముసలి మహిళ) కి నిప్పు పెడతారు. ఆ నిప్పులో మాతరి, మాత్ర రెండు కుప్పలు కాలి మంటలు ఎగిసి పడతాయి. ఆ మంటల కింద గ్రామ యువకులు ఉత్సాహంతో కేకలు బొబ్బలు ఈలలు వేస్తూ నృత్యాలు చేస్తారు. ఈ మాతరి మాత్ర కాలుతున్న సమయంలో గ్రామ సమీపంలో మహిళలందరు తమ ఇంటి నుండి తెచ్చిన నీటి చెంబులతో ఆ కాలుతున్న మాతరి, మాత్ర వైపు కాళ్ళు మొక్కుతూ నీళ్ళు పోసి తిరిగి తమ ఇంటికి వెళతారు.
ముందుగా కాలుతున్న మాతరి కింద పడుతుందా..? లేదా మాత్ర కింద పడుతాడా...? అని చూస్తారు. రెండింటిలో ఏది కింద పడుతుందో చూసి, మంటల్లో కాలుతున్న వెదురు కర్రలకు పైన తాళ్లతో కట్టి క్రిందకు వేలాడదీసిన బాసింగాలు కింద పడుతున్న సమయంలో వచ్చిన వారిలో కొందరు యువకులు వాటిని ఎగిరి ఎగిరి అందుకోవడానికి పోటీ పడతారు. కింద పడుతున్నాయి అన్న సమయంలో ఆ బాసింగాలలో తగిలించిన కుడుకలను అందుకుంటారు. కొందరు కింద పడ్డ మాతరి లేదా మాత్ర వెదురు కర్రను అందుకుని దగ్గరలోని బావి వద్దకు పరుగెత్తుతారు.
అక్కడ ముట్టించి వస్తారు. అయితే ఆదివాసి గోండు గూడేలల్లో ఒక నమ్మకం ఉంది ముందుగా మాతరి కింద పడితే ఆ యేడాది ఆ గ్రామంలో తమ ఇండ్లల్లో ఆడ వారితో లక్ష్మి ఉంటుంది. అని భావించి, ఇంటిలో పొలంలో పనులకు జరిగే మూహుర్తాల్లో ఆడవారిని ముందు చేసి కార్యక్రమం ప్రారంభిస్తారు. ఒక వేళా మాత్ర ముందుగా పడితే తమ ఊరిలో తమ ఇండ్లల్లో జరిగే మంచి కార్యక్రమాల్లన్నిటిలో మగవారితో ప్రారంభిస్తారు.
కింద పడ్డ మాతరి, మాత్ర బాసింగాలలో తగిలించిన కుడుకలు, గారేలు, బూరేలు, చక్కరే పేర్లను విప్పి ఒక పల్లం లో వేసి ఉంచుతారు. దీన్ని ‘పులారా’ అంటారు. పాట్ల, దేవారి అక్కడే ఉంటారు. ఇద్దరు ముగ్గురు యువకులు కూడా అక్కడే ఉండి వచ్చే వారి కొరకు కూర్చోవడానికి గోనె సంచులు, లేదా పారీలు పరిచి సిద్ధంగా ఉంచుతారు. మిగి తా వారందరు తమ ఇండ్లకు వెళ్లి, కాళ్ళు చేతులు కడుక్కుని, ఇంటిలో ఆడవాళ్ళు తమ కొరకు ఒక పళ్లెంలో సిద్ధంగా ఉం చిన ఒక బూరే, కొంచం అన్నం, పైన ఒక తువాల కప్పి తల కు ఒక తువాల చుట్టి, చేతిలో త్రాగే మంచి నీళ్ళు పట్టుకొని, మళ్లీ ఊరి పొలిమేరలో ఉన్న మాతరి, మాత్ర దూరడి (కాముడు కాల్చిన చోట) వస్తారు.
మాతరి, మాత్ర చుట్టూ కొం చం కొంచం నీళ్ళు పోస్తూ నాలుగు సార్లు ప్రదక్షణ చేసి ఇం టి నుంచి తెచ్చిన పల్లెంలోని బూరే, అన్నం నుండి కొంచం నైవేద్యం సమర్పిస్తారు. ఆ నీళ్లు చల్లి ఆ తెచ్చిన సద్ది అన్నం, బూరే ను అక్కడే కూర్చున్న పటేల్ దేవారి చేతిలో ఇస్తారు. ఇలా ప్రతి ఇంటి నుండి తీసుకు వచ్చిన సద్ది అన్నం, బూరే ను ఒకే దగ్గర కలుపుకొని ఉంచుతారు.
ఆ తరువాత అంద రు రావదంతో గ్రామంలోని పటేల్, దేవారి పులారా ను అందరికీ పంచి పెడతారు. ఈ పులారను పంచిపెట్టే సమయంలో ఎవరైనా గ్రామంలో కాకుండా గ్రామం బయట వెళ్లి స్థిర నివాసం ఏర్పరచాలనుకుంటే, లేదా తమ ఊరిలో కాకుండా ఇల్లరికపు పెండ్లిల్లు చేసుకునే యువకులకు ఈ పులారను ఇవ్వరు. మిగితా అందరికీ ఇస్తారు. యువకులు అందరి దగ్గరి నుండి సేకరించిన అన్నం బూరేలను తిరిగి వరుసలో కూర్చున్న గ్రామస్తులందరికీ పంచి పెడతారు. అందరు కలిసి ఆ ప్రసాదాన్ని తింటారు.
అనంతరం అందరు కలిసి డోలు వాయిస్తూ నృత్యాలు చేస్తూ గ్రామానికి వెళతారు. గ్రామంలోని ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి అక్కడ డోలు వాయిస్తూ, నృత్యాలు చేస్తూ జాజూరి అడుగుతారు. మహిళలు ఒక చాటలో తమ ఇంట్లో ఉన్న జొన్నలు, లేదా మక్కలు, శెనగలు, కందులు, బెబ్బర్లు తమ ఇంట్లో ఏవి ఉంటే అవి తెచ్చి ఇస్తారు. ఈ సేకరించిన ధాన్యాలను స్వీకరించి గ్రామంలో ఉన్న ఒక పెద్ద గంజును కూడా పట్టుకొని తిరిగి దూరాడి (కాముడు కాల్చిన చోట) వద్దకు వస్తారు. వచ్చి మాతరి, మాత్ర వద్ద ఒక పొయ్యి ఏర్పాటు చేసి గ్రామంలో సేకరించిన ధాన్యాలను ఇక్కడ గుడాలు వండుతారు.
రాత్రంతా అక్కడే నృత్యాలు చేస్తారు. ఇక తెల్లవారగానే ఉదయం మొఖం కడిగి తమ ఇంటి నుండి ఒక పళ్లెం పట్టుకొని గుడాలను తీసుకుంటారు. తమ పొలం వద్ద ఉన్న ఒక ఆరే చెట్టు వద్దకు లేదా తమ పొలం వద్ద ఉన్న మోదుగు చెట్టు వద్దకు వెళ్లి ఈ పవిత్ర గుడాలతో నైవేద్యం సమర్పిస్తారు. ఆ తరువాత కొన్ని గుడాలను తమ పొలంలో చల్లుతారు. అందరు కలిసి గుడాలు తిని ఇంటికి చేరుకుంటారు.దీంతో దుర్ది (హోలీ) ప్రారంభం అవుతుంది.
అయితే ఈ దుర్ది (హోలీ) రోజున ఉదయం అంతుకు ముందే తెచ్చిన మోదుగ పూలను (గోండి భాషలో ముర్ పోహ్చాడ్ అని అంటారు) బాగా దంచి నీళ్లలో నాన బెడతా రు. కేవలం పువ్వులో ఉండే ఆకులను మాత్రమే నానబెడతారు.
మధ్యలో ఉండే తెల్లనిది పడేస్తారు. కొంత సేపటి తరువాత అది రంగుగా మారుతుంది. ఆ తరువాత గ్రామస్తులందరూ కలిసి గ్రామంలో ఉన్న అన్ని దేవత(ఆకింగ్ మార్కై)లకు రాసిన తరువాత తమను ఒకరినొకరు రంగులను పోసుకుంటారు. ఆదివాసీ గూడేలల్లో వరుసకు బావ, మరదుళ్లకు రంగు పూస్తారు. ఆదివాసి గూడేలల్లో రసాయ న రంగులను వాడకుండా అడవిలో పూచే మోదుగ పూల తో సహజ సిద్దంగా రంగులు తయారు చేసి వాడుతారు.




